అభివృద్ధికి అప్పే దిక్కని కేంద్రానికి మొర

  •     కాళేశ్వరం, మిషన్​ భగీరథ ఇంకా పూర్తి కాలే
  •     అవి పూర్తయితేనే అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి కార్పొరేషన్లకు వస్తది
  •     కేంద్ర ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్​లో రాష్ట్ర స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు
  •     కార్పొరేషన్ల అప్పులనూ రాష్ట్రాల అప్పుగానే చూస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ

హైదరాబాద్​, వెలుగు: అప్పులు తెచ్చుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం, మిషన్​ భగీరథ ఇంకా పూర్తి కాలేదని, అవి పూర్తయితేనే అప్పులు కట్టే పరిస్థితి కార్పొరేషన్లకు వస్తుందని తెలిపింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. రాష్ట్రాల అప్పులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ రామకృష్ణారావు పాల్గొన్నారు. అప్పుల కోసం పర్మిషన్​ ఇవ్వాలని ఆయన కోరారు. కార్పొరేషన్ల అప్పులను రాష్ట్ర అప్పులుగా చూడటం సరికాదని, ఆర్థిక సంఘం నిబంధనల పేరుతో కేంద్రం వివక్ష చూపిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

అయితే.. కార్పొరేషన్ల పేరిట తీసుకున్న అప్పులను రాష్ట్రాల అప్పులుగానే చూస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కాగా, తెలంగాణకు ఆర్​బీఐ నుంచి రావాల్సిన అప్పులకు అనుమతి ఇవ్వకపోవడంపై తమ  నిరసన వ్యక్తం చేసినట్లు స్పెషల్​సీఎస్​ రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేషన్ల అప్పుల్లో భాగంగా ప్రధానంగా కాళేశ్వరం, మిషన్​ భగీరథ, తెలంగాణ స్టేట్​ వాటర్​ రిసోర్సెస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కు చెందినవి ఉన్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, అవి పూర్తయితేనే ప్రభుత్వ గ్యారంటీపై పొందిన అప్పులను కార్పొరేషన్లు చెల్లించగల స్థితికి వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్​సీడీసీలు ఇచ్చే అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నదని, వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని పేర్కొన్నారు. కొన్ని అప్పులను ఎఫ్​ఆర్​బీఎం పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం సరైంది కాదన్నారు. అప్పుల విషయంలో 15 వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫార్సులు చేయకపోయినా.. బడ్జెట్​లో చూపని అప్పులనూ రాష్ట్రాల అప్పులుగా తీసుకుంటామని చెప్పడం కక్షపూరితంగా ఉందని రామకృష్ణారావు ఆరోపించారు. కరోనా పరిస్థితుల తర్వాత గాడిలో పడుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని అన్నారు. ఒకవేళ కొత్త నిబంధనలు అమలు చేస్తే 2020–21 నుంచి ఎలా చేస్తారని, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి చేయాలని పేర్కొన్నారు.