మూడేండ్లలో వరంగల్, కరీంనగర్ లకు కేం ద్రం నుంచి రూ.392 కోట్లు
మ్యాచింగ్ గ్రాంట్ కింద నిధులివ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం
(వరంగల్ రూరల్/కరీంనగర్, వెలుగు): రాష్ట్రం నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన వరంగల్, కరీంనగర్ డెవలప్మెంట్ ను టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదు. 2016లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద ఈ రెండు నగరాలను ఎంపిక చేసింది. 2016–17 నుంచి ఐదేండ్లపాటు కేంద్రం ఏటా రూ.100 కోట్ల చొప్పున ఇస్తే.. మరో రూ.100 కోట్లను రాష్ట్ర సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాలి. అలా వచ్చే రూ.వెయ్యి కోట్లతో వరంగల్, కరీంనగర్ లో రోడ్లు, జంక్షన్లు, పార్కు లు, బస్‌బేలు, ఇతరత్రా సౌలతులను కల్పించాలి.
కేంద్రం తన వాటాగా ఇప్పటి కే ఒక్కో సిటీకి రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసింది. అయితే టీఆర్ఎస్ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోవడంతో మొదట్లో స్పీడ్‌గా సాగిన స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ వర్క్స్ కు బ్రేకులు పడ్డాయి. చేసిన పనులకూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) కూడా సమర్పించకపోవడంతో సెంట్రల్ ఫండ్ స్ ఆగిపోయి స్మార్ట్‌సిటీల పరిస్థితి దారుణంగా మారింది. పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోవడంతో చిన్న వర్షా లకే రెండు నగరాల వాసులు నరకం చూస్తున్నారు.
ఘనంగా డీపీఆర్ లు..
2016 జూన్ లో కరీంనగర్, గ్రేటర్ వరంగల్ ను స్మార్ట్ సిటీలుగా కేంద్రం ఎంపిక చేసింది. రాష్ట్ర సర్కారు ఆదేశాలతో రూ.2,861 కోట్లతో వరంగల్ స్మార్ట్‌సిటీ డీపీఆర్ ను అధికారులు రెడీ చేశారు. తర్వాత దానిని రూ.2,252.85 కోట్లకు కుదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేండ్లలో రూ.500 కోట్ల చొప్పున ఇస్తే పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్)పద్ధతిలో మరో రూ.906 కోట్లు సమీకరించాలని ఆఫీసర్లు భావించారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సర్దుబాటు చేయాలనుకున్నారు. కరీంనగర్ లోనూ రూ.1,879కోట్లతో డీపీఆర్ రూపొందించారు..
ఎక్కడి పనులు అక్కడే..
రాష్ట్ర సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, యూసీలు ఇవ్వక సెంట్రల్ ఫండ్స్ ని లిచిపోవడంతో వరంగల్, కరీంనగర్ లో డెవలప్ మెంట్ వర్క్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా వరంగల్ సిటీలో చేపట్టిన 84 వర్కుల్లో ఇప్పటి వరకూ పది మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వర్క్ ఆర్డర్, టెండర్లు, డీపీఆర్ దశలో ఉన్నాయి. కరీంనగర్ లో ప్రాధాన్యతా క్రమంలో 21 వర్క్‌లకు టెండర్లను పిలిచినా.. ఫండ్స్ లేక పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ లు ముందుకు రావడం లేదు. పనులు దక్కించుకున్నవారు మధ్యలోనే వదిలేసిపోతున్నారు. కరీంనగర్ లో ఇప్పటి వరకు కమాన్ చౌరస్తా డెవలప్ మెంట్, ఫౌంటెయిన్ ఏర్పాటు మాత్రమే పూర్తయ్యింది. రోడ్ల నిర్మా ణాలు నత్తనడకన సాగుతున్నాయి. లోకల్ ఆఫీసర్ల అవినీతి, పర్యవేక్షణ కొరవడటంతో జరుగుతున్న పనుల్లో నూ క్వాలిటీ కరువైంది. ఈలోపు వర్షా కాలం రావడంతో ఈ రెండు సిటీల్లో కోతలకు గురైన రోడ్లు, గుంతలు, దెబ్బతిన్న జంక్షన్లు నగరవాసులకు నరకం చూపుతున్నాయి. యూసీలు సమర్పించడంతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేస్తే తప్ప స్మార్ట్‌సిటీ పనుల వేగం పెరిగే చాన్స్ కనిపించడం లేదు.
మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కడ?
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు ఐదేండ్లు . 2022 జూన్ కల్లా పనులు పూర్తి కావాలి. ఇప్పటికే మూడేండ్లు గడిచిపోగా.. మిగిలింది రెండేండ్లే . 2016లోనే కేంద్రం తన వాటాగా ఒక్కో స్మార్ట్ సిటీకి రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసింది. దీనికి సమానంగా రాష్ట్ర సర్కారు ఫండ్స్ రిలీజ్ చేయాలి. కానీ, గ్రేటర్ వరంగల్ కు రూ.40 కోట్లు, కరీంనగర్ కు రూ.35 కోట్లు మ్యాచిం గ్ గ్రాంట్ కింద ఇచ్చామని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. అయితే ఆ ఫండ్స్‌ను ఇతర అభివృద్ధి పనులకు మళ్లించారని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో కేం ద్రం ఇచ్చిన ఫండ్సే రెండు సిటీలకూ దిక్కయ్యాయి. ఆ ఫండ్స్‌ను కూడా మిషన్ భగీరథ స్కీమ్ కు మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రెండు నగరాల్లో పనులన్నీ పెండింగ్ లో పడ్డాయి.
యూసీలు సబ్ మిట్ చేయట్లే
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రెండు సిటీలకు కేంద్రం ఇచ్చిన ఫండ్స్‌ను ఏయే పనులకు ఖర్చు చేశారు? ఇంకా ఎన్ని ఫండ్స్ మిగిలాయి? ఇంకా ఎన్ని నిధులు కావాలి? తదితర వివరాలతో యూసీలను ఏటా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించాలి. కానీ, ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ యూసీలు సబ్ మిట్ చేయలేదు. దీంతో కేంద్రం నుంచి రెండో విడతగా రావాల్సిన సుమారు రూ.400 కోట్లు ఆగిపోయాయి . రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై కేంద్రం రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖలు రాసినా.. స్పందన లేకపోవడంతో నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.