అన్ని వర్గాలను మోసగించిన రాష్ట్ర ప్రభుత్వం

అన్ని వర్గాలను మోసగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • భారీ మెజారిటీతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి
  • ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే 
  • ఏలేటి  మహేశ్వర్ రెడ్డి  పిలుపు

నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరో పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల సన్నాహక సమావేశంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య,  ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. అనంతరం   మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో నిరుద్యోగులకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 

హామీలను అటకెక్కించే ప్రయత్నం  చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను సైతం మోసం చేస్తోందని,  పే స్కేల్, పీఆర్సీ, డీఏ వంటి అంశాల్లో దగా చేశారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  తనను ఎమ్మెల్సీ గా గెలిపిస్తే ప్రజా గొంతుకగా నిలుస్తానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పేర్కొన్నారు. 

ప్రభుత్వ మోసాలపై అధిష్టానంతో కలిసి పోరాటాలు సాగిస్తానన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం, గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తానని ఆయన హామీని ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నేతలు సత్యనా రాయణ గౌడ్, అయ్యన్న గారి భూమయ్య, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి,  అయ్యన్న గారి రాజేందర్, తో పాటు పట్టణ, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు,గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు.