బాలామృతం మరింత టేస్ట్​.. పౌడర్లో 4 ఫ్లేవర్లు

బాలామృతం మరింత టేస్ట్​.. పౌడర్లో 4 ఫ్లేవర్లు
  • పౌడర్​లో 3, 4 ఫ్లేవర్లు కలపాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  • నిధులు పెంచాలని కేంద్రానికి మంత్రి సీతక్క వినతి
  • త్వరలో కేంద్ర మంత్రితో సీతక్క, ఉన్నతాధికారుల భేటీ
  • రాష్ట్రంలో10 లక్షల మంది చిన్నారులకు ప్రతినెలా 2,500 మెట్రిక్ టన్నుల బాలామృతం సరఫరా

హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీల్లో చిన్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్న బాలామృతానికి కొత్త రూపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం సరఫరా చేస్తున్న బాలామృతంలో కొత్తగా ఏమేం కలిపి ఇవ్వాలో తెలపాలని అధికారులను ప్రభుత్వం కోరింది. 

ఈ రిపోర్ట్ రాగానే ప్రభుత్వం పలు మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ.. అంగన్ వాడీల ద్వారా 10 లక్షల మంది 6 నెలల నుంచి మూడేండ్ల పిల్లలకు ప్రతిరోజు 100 గ్రాముల బాలామృతంను ఉచితంగా అందజేస్తోంది. 

అయితే, రోజూ ఒకే రకమైన పౌడర్ ఇస్తుండడంతో చిన్నారులు రెగ్యులర్ గా తీసుకోవడం లేదని చిన్న పిల్లల తల్లులు అంగన్ వాడీ టీచర్లకు, ఆయాల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈనేపథ్యంలో ఇందులో వారానికి 3,4 ఫ్లేవర్లలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పొడిని టీజీ ఫుడ్స్ కార్పొరేషన్.. ప్రతి నెలా 2,500 మెట్రిక్ టన్నులు అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది.

పోషకాలతో కూడిన బాలామృతం సరఫరా..

ప్రస్తుతం 6 నెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులకు ప్రత్యేకంగా పోషక విలువలు కలిగిన బాలామృతంను ప్రభుత్వం అందజేస్తోంది. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్​అందిస్తూ సాధారణ బరువుకు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. 

100 గ్రాముల బాలామృతంలో 414 కిలో కేలరీల శక్తి, 11 గ్రాముల ప్రోటీన్లు ఉండగా 167 మిల్లీ గ్రాముల కాల్షియం, 3.1 మిల్లీ గ్రాముల ఐరన్‌‌‌‌‌‌‌‌, 2.5 మిల్లీ గ్రాముల విటమిన్‌‌‌‌‌‌‌‌ ఏ, 0.3 మిల్లీ గ్రాముల విటమిన్‌‌‌‌‌‌‌‌ బీ1, 0.2 మిల్లీ గ్రాముల విటమిన్‌‌‌‌‌‌‌‌ బీ2, 0.5 మిల్లీ గ్రాముల విటమిన్‌‌‌‌‌‌‌‌ సీ, 7.1 మిల్లీ గ్రాముల ఫోలిక్‌‌‌‌‌‌‌‌ యాసిడ్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. 

వీటితో పిల్లలకు సరైన ఆహారం అంది, వారిని ఆరోగ్యంగా  ఉంచుతుందని టీచర్లు చెప్తున్నారు. ఒక ప్యాకెట్‌‌‌‌‌‌‌‌లో 2.50 కిలోల బాలామృతం ఉండగా.. నెలకు ఒకటి చొప్పున చిన్నారులకు అందిస్తున్నారు. 6  నెలల నుంచి ఏడాది వయసు ఉన్న పిల్లలకు రోజుకు 100 గ్రాములు మూడు సార్లు పాలల్లో లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తినిపించాలని,. ఒక సంవత్సరం వయసున్న వారికి మోతాదు పెంచాలని అంగన్ వాడీ టీచర్లు చెబుతున్నారు.

గర్భిణులకు ఎక్కువ స్కీమ్​​లు అమలుచేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

ఏటా రాష్ట్రంలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అమలుచేస్తున్న స్కీమ్ లు, ఖర్చు చేస్తున్న నిధుల్లో కేంద్రం వాటా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వాటా పెంచడంతో పాటు రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కేంద్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కోరారు. 

ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఓ సెమినార్ లో ఆమెను కలిసి.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కీమ్ ల వివరాలు, ఖర్చు చేస్తున్న బడ్జెట్, ఇందులో కేంద్ర వాటాపై కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క వివరించారు. దీంతో త్వరలో ఢిల్లీలో కలిసి చర్చిద్దామని కేంద్ర మంత్రి సూచించారు. 

అయితే, ఈ వారంలోనే అధికారులతో వెళ్లి కలిసేందుకు మంత్రి సీతక్క ఇప్పటికే అపాయింట్ మెంట్ కోరినట్టు తెలిసింది. కేంద్రం నిధుల వాటా పెంచితే చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఎక్కువ స్కీమ్ లు అమలుచేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వారంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో నిధుల పై క్లారిటీ వచ్చే అవకాశముందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.