కులగణన వివరాలు సేఫ్​...మిస్ యూజ్ కాకుండా ప్రత్యేక సాఫ్ట్ వేర్

కులగణన వివరాలు సేఫ్​...మిస్ యూజ్ కాకుండా ప్రత్యేక సాఫ్ట్ వేర్
  • ఒకరిద్దరు ఉన్నతాధికారులకే యాక్సెస్ ఇచ్చేలా ఏర్పాట్లు 
  • అపోహలు అవసరం లేదంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు : సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్​యూజ్​ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి.. ప్రతి కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత వివరాలతోపాటు అప్పులు, ఆస్తిపాస్తులు వంటివన్నీ నమోదు చేస్తున్నారు. వీటన్నింటిని కూడా ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక సాఫ్ట్​​వేర్​లో ఎంట్రీ చేయనున్నారు.

ఎవరికీ పూర్తిస్థాయిలో యాక్సెస్​ లేకుండా ఈ సాఫ్ట్​ వేర్​ ను రెడీ చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి డేటా వస్తున్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సైబర్​ నేరగాళ్లు కూడా అటాక్​ చేసి సమాచారాన్ని దొంగిలించే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులను  ప్రభుత్వం  అప్రమత్తం చేసింది.

రాష్ట్రంలో ఏ వర్గం ఎలా ఉంది ? ఎవరి పరిస్థితులు ఏమిటి? అనేవి తెలుసుకుని దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించాలని నిర్ణయించింది. అలాగే, రిజర్వేషన్ల క్యాప్​ 50 శాతం దాటాలంటే ఏయే వర్గం ఏ స్థాయిలో ఉన్నదో కూడా సమగ్రంగా ఉంటేనే సుప్రీంకోర్టు అనుమతించేందుకు అవకాశం ఉన్నది. అందులో భాగంగానే వివరాలన్నింటిని తీసుకుంటున్నట్టు సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు వెల్లడించారు. 

ఒకేచోట అన్ని వివరాలు

రాష్ట్రంలో సమగ్ర కుల గణన కోసం  దాదాపు కోటి 20 లక్షల ఇండ్లకు స్టిక్కరింగ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబ సభ్యుడి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. సేకరించిన డేటాను ఏ ఒక్క కాలమ్​ కూడా మిస్​ చేయకుండా డిజిటలైజ్​ చేస్తారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలందరి వివరాలు ఒకేచోటకు రానున్నాయి.  కాగా,  వ్యక్తిగత వివరాలన్నింటినీ సాఫ్ట్​​వేర్​లో ఒకరిద్దరు ఉన్నతాధికారులకు మినహా ఇంకెవరికి యాక్సెస్​ ఇవ్వకుండా భద్రపరిచేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తమ డేటా ఏమవుతుందోనన్న అపోహలు ప్రజలకు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు