నల్గొండ, వెలుగు: ధూప దీప నైవేద్యం స్కీం కింద గుడుల ఎంపిక బాధ్యతను కూడా రాష్ట్ర సర్కార్ ఎమ్మెల్యేలకే కట్టబెట్టింది. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్‌ఫండ్, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు లాంటి స్కీములకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న ఎమ్మెల్యేలు ఇకపై దేవాలయాలనూ ఎంపిక చేయనున్నారు. ఈ స్కీం కింద దీప, ధూప, నైవేద్యాలకు నోచుకోని గుడులను గుర్తించి, అక్కడి అర్చకులకు ప్రతి నెలా రూ.6వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎండోమెంట్ ఆఫీసర్లను కాదని ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యత అప్పగించడంతో పేద అర్చకులు కావాల్సిన పత్రాలు పట్టుకొని ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఏడాది కిందే అప్లికేషన్లు..
దళితబంధు తరహాలోనే ధూప దీప నైవేద్యం స్కీం గైడ్ లైన్స్‌ను రాష్ట్ర సర్కారు మార్చేసింది. రిటన్ ఆర్డర్స్ ఇస్తే అర్చక సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఆఫీసర్లకు ఓరల్ ఆర్డర్స్ ఇచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం ఈ స్కీం కింద గుడుల ఎంపిక బాధ్యత ను ఎమ్మెల్యేలకు అప్పగించింది. వాస్తవానికి కిందటేడు జూన్ లో ధూప దీప నైవేద్య స్కీం కింద 1,160 గుడులకు ఎండోమెంట్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది అర్చకులు ఈ స్కీం కింద తమ గుడులను ఎంపిక చేయాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావారీగా అప్లికేషన్లను వడబోసిన ఫైవ్ మెన్ కమిటీ మూడు వేల మంది అర్చకుల అప్లికేషన్లతో తుది జాబితా రూపొందించి, కమిషనర్ ఆఫీస్ కు పంపింది. కానీ ఇప్పుడు నియోజకవర్గానికి పది చొప్పున ఎమ్మెల్యేలు సిఫార్సు మేరకు లిస్టు మార్చి పంపాలని ఓరల్ ఆర్డర్స్ వచ్చాయని ఆఫీసర్లు, అర్చక సంఘాల నాయకులు చెప్తున్నారు.
లిస్ట్ పెండింగ్పెట్టి కొత్త గైడ్‌లైన్స్..
గతేడాది ఎండోమెంట్శాఖకు వచ్చిన అప్లికేషన్లలోంచి ఫైవ్‌మెన్ కమిటీ3 వేల గుడులతో లిస్టు ఫైనల్ చేసింది. ఈ గుడులు, అర్చకుల వివరాలను ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు. ఇవాళో, రేపో తాము స్కీం పరిధిలోకి వస్తామని అర్చకులు ఎదురుచూస్తున్న తరుణంలో సర్కారు చావు కబురు చల్లగా చెప్పింది. నిజానికి గతేడాది వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేల గుడులు దూప దీప నైవేద్యం స్కీం కింద ఉండేవి. వాటిని కనీసం 3వేలకు పెంచాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. పాత వాటిని రెన్యువల్ చేయాలనుకున్నా 2వేల గుడుల్లో కనీసం 2వేల మంది అర్చకులకు చాన్స్ ఇవ్వాలి. కానీ ఒక్కో ఎమ్మెల్యేలకు పది మంది చొప్పున అవకాశం ఇస్తే 119 నియోజకవర్గాల నుంచి 1190 మంది అప్లికేషన్లను మాత్రమే ఫైనల్చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో ఉన్న 2వేలతో పోల్చితే ఇది 810 తక్కువ. దీనిపై అర్చకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, గతంలో ఉమ్మడి జిల్లావారీగా గుడులను ఎంపిక చేయగా, ఇప్పుడు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుంటుండడంతో తమ గుడులు ఎక్కడ స్కీంకు ఎంపికకాకుండా పోతాయోనని పాతవాళ్లు టెన్షన్ పడ్తున్నారు.
ఆర్థిక భారం మీద పడుతుందనే..
ధూపదీప నైవేద్యం కింద మూడువేల గుడులకు చాన్స్ ఇస్తే ఎండోమెంట్ శాఖపై ఆర్థిక భారం పడుతుందని ఆలోచించిన ప్రభుత్వం నియోజకవర్గానికి పది మంది అర్చకులను మాత్రమే సెలక్ట్ చేయాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ స్కీం కింద ఒక్కో టెంపుల్ కు ప్రభుత్వం ఆరు వేలు చెల్లిస్తోంది. దీంట్లో రూ.4వేలు అర్చకుల వేతనం కాగా, రూ.2వేలు గుడి ఖర్చుల కింద ఇస్తోంది. మూడు వేల గుడులు అనుకుంటే నెలకు రూ.కోటి 80 లక్షలు. ఈ ఖర్చు కూడా భరించేందుకు సిద్ధం లేని సర్కారు పేద అర్చకుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొందరికే న్యాయం..
ధూప, దీప నైవేద్యం కింద గుడుల ఎంపిక తొందరగా చేపట్టాలి. తక్కువగా ఎంపిక చేయడం వల్ల కొందరికే న్యాయం జరుగుతుంది. ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తే దాంట్లో రానివాళ్లకు సెకండ్ ఫేజ్ లో అప్లై చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. నియోజకవర్గానికి పది అంటే అర్చకులు ఇబ్బంది పడుతారు.
- దౌలాతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు, ధూప, దీప నైవేద్య అర్చకుల సంఘం
ఖర్చులు పెంచాలి..
ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ప్రభుత్వం ఆదరణ కల్పించాలి. త్వరగా అర్చకుల భర్తీ ఎంపిక పూర్తి చేయాలి. ధూప దీప నైవేద్యం ఖర్చులు పెంచాలి. పెన్నా మోహన శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం