ఆ 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వండి ..కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ కు రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి చేసింది. డీఎంఈ వాణి, ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌, ఇతర ఉన్నతాధికారులు బుధవారం ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. గతంలో ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించుకున్నామని, పర్మిషన్ ఇవ్వాలని కోరారు.

 ఇంకేమైనా లోపాలు ఉంటే సవరించుకుంటామని, అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి వివరించారు. ‘‘కేంద్ర అధికారులు చాలా ప్రశ్నలు అడిగారు. కొన్నింటికి సమాధానాలు చెప్పగలిగాం. కొన్నింటికి చెప్పలేకపోయాం. ఎందుకు చేయలేకపోయామనేది వారికి వివరించాం. 

పర్మిషన్ వస్తుందో.. లేదో.. వారం రోజుల్లో తేలిపోతుంది” అని ఢిల్లీకి వెళ్లిన ఓ ఉన్నతాధికారి వెలుగుకు తెలిపారు. కాలేజీలకు పర్మిషన్లు వచ్చే అవకాశం ఉందని, ప్రాథమిక అనుమతి వచ్చాక, ప్రభుత్వం అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, అలా ఇస్తే లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తారని మరో అధికారి తెలిపారు.