ఇరిగేషన్‌కు గత ఏడాది రూ. 25 వేల కోట్లు.. ఇప్పుడు 8,490 కోట్లే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తమ ఫస్ట్ ప్రయారిటీగా చెప్పే ఇరిగేషన్‌కు ఈ సారి బడ్జెట్‌లో సగానికి సగం కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే రూ.16,510 కోట్లు కట్ చేసింది. 2018–-19లో రూ.25వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.8,490.75 కోట్లే ఇచ్చింది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌లో నీటి పారుదల రంగానికి రూ. 22,500 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం ఫుల్ బడ్జెట్‌కు వచ్చే సరికి భారీగా కోత విధించింది. రూ. 8,490.75 కోట్లలో ప్రగతి పద్దు 5,012.43 కోట్లుగా.. నిర్వహణ పద్దు రూ.3,478కోట్లుగా పేర్కొంది. మేజర్ ఇరిగేషన్‌కు రూ. 7,740.40 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.20 కోట్లు కేటాయించింది. ఒక్క సీతారామ ఎత్తిపోతల పథకానికి మినహా మిగతా అన్ని పథకాలకు పెద్ద ఎత్తున కత్తెర వేసింది. బడ్జెటేతర నిధుల ద్వారా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టుల కోసం అప్పులు తేవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.
ఆశలు ఆవిరి
సాగు ప్రాజెక్టులకు మూడేండ్లుగా ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌లోనూ భారీ పద్దునే ప్రతిపాదించింది. ఫుల్ బడ్జెట్‌లో సీఎం సాగునీటి రంగానికి భారీ కేటాయింపులు చేస్తారనే ఆశతో అధికారులు రూ. 26,500 కోట్లతో అంచనాలు సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6 వేల కోట్లు, పాలమూరు–-రంగారెడ్డికి రూ. 7 వేల కోట్లతో ప్రతిపాదనలు అందజేశారు. కానీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ 1,080.18 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ. 500 కోట్లే ఇచ్చింది. సీతారామ ప్రాజెక్టుకు మాత్రమే ఓ మోస్తరు నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు రూ.1,324 కోట్లు అలొకేట్ చేశారు.
అప్పు పుడితేనే..!
కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ. 31 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.32 వేల కోట్లకు పైగా అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం కోసం రూ.18 వేల కోట్లకు పైగా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10 వేల కోట్లు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కోసం, మరో రూ.4 వేల కోట్లకు పైగా నిధులను కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకు అప్పుగా తీసుకోనున్నారు. దీనికి అగ్రిమెంట్ ప్రక్రియ సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రూ.30 వేల కోట్ల వరకు రుణాలు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ. 18 వేల కోట్ల అప్పు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 11 వేల కోట్లకు పైగా రుణ సేకరణకు త్వరలోనే ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. ఈ నిధులతోనే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆన్గోయింగ్కు నామమాత్రం
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను ఈ యేడాది పూర్తి చేయిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల హామీ ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఆ ప్రాజెక్టులను విస్మరించారు. కల్వకుర్తికి గతేడాది రూ.394 కోట్లు కేటాయించగా, ఈ యేడాది కేవలం రూ.4 కోట్లతోనే సరిపెట్టారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు రూ.25 కోట్ల చొప్పున, జూరాలకు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టుల పెండింగ్ పనులు పది శాతం కూడా పూర్తయ్యే అవకాశం లేదు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పులు తెచ్చి పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం చిన్న తరహా ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో బడ్జెట్‌లో పేర్కొనలేదు. సీతారామ ఎత్తిపోతల పథకం, దేవాదుల, ఇందిరమ్మ వరద కాలువలను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకురాగా, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తిరిగి అప్పులు తెచ్చే యోచనలో ఉంది. మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన నిధులు నిర్వహణకే సరిపోయే అవకాశముంది.