- 50 ఎకరాలకు ఒక క్లస్టర్..2 వేల క్లస్టర్లలో ఏర్పాట్లు
- ఆర్గానిక్ మార్కెట్ రూ.1500 కోట్లు
- పీకేవీవై పథకం అమలుకు శ్రీకారం.. రైతులకు ప్రోత్సాహకాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుకొచ్చే రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. పరంపరాగత్ కృషి వికాస్ యోజనా (పీకేవీవై) కింద కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నది.
దీని కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలను అమలు చేయకపోవడంతో రాష్ట్రానికి నిధులు రాలేదు. తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పీకేవీవై ద్వారా సేంద్రీయ సాగుకు సిద్ధమైంది.
రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు..
సేంద్రియ ఎరువుల వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కారు శాస్త్రీయ ప్రణాళికలు రూపొందిస్తున్నది. 7 బస్తాల రసాయన ఎరువులు వాడే రైతులు ఇక నుంచి విధిగా సగం సేంద్రియ ఎరువులు జోడించాలని సుప్రీంకోర్టు, పార్లమెంటరీస్థాయి కమిటీ స్పష్టం చేసిన దృష్ట్యా.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించనున్నది. రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల విధానాలు అమలవుతున్న వేళ సాగు ఖర్చులు తగ్గింపుపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా రైతుల్లో అవగాహన కల్పించి.. ఎరువుల క్రమబద్ధీకరణ, సేంద్రీయ, ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రంగం సిద్ధం చేసింది.
రాష్ట్రంలో పీకేవీవై పథకం అమలుకు శ్రీకారం
క్లస్టర్ విధానంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. పీకేవీవై కింద సేంద్రియ సాగు చేస్తున్న ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలకు మూడేండ్లలో ప్రోత్సాహకంగా రూ.50 వేలు అందిస్తారు. ఇందులో ఆర్గానిక్ ఇన్‌ఫుట్ కోసం రూ.31 వేలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు. అదేవిధంగా మార్కెటింగ్, ప్యాకేజీ బ్రాండింగ్, విలువ జోడింపునకు రూ.8,800, సర్టిఫికేషన్‌కు రూ.2,700, అవసరమైన శిక్షణ, సామర్థ్యం పెంచేందుకు రూ.7,500 సాయం అందిస్తారు.
కాగా, విష రసాయనాల అధిక వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలనేదే పీకేవీవై పథకం లక్ష్యం. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పీకేవీవై కింద అత్యధికంగా 5.09 లక్షల ఎకరాల్లో 2.65 లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిరుడు రూ.317.21 కోట్ల నిధులు అందించింది. దేశంలోనే ఈ నిధులు వినియోగించుకోవడంలో ఏపీ టాప్‌లో ఉంది. ఆ తర్వాత పీకేవీవై కింద అత్యధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ALSO READ : జనవరి 7 నుంచి పాలమూరులో స్టేట్ లెవల్ సైన్స్ ఫెయిర్
4 రెట్లు పెంచే యోచనలో సర్కారు
50 ఎకరాల చొప్పున ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో 2 వేల క్లస్టర్లలో సేంద్రియ సాగును ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం లక్ష ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని వ్యవసాయశాఖ యోచిస్తున్నది. గత కొన్నేళ్లుగా సేంద్రియ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో దాదాపు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా, కొత్త సర్కారు గతంలో కంటే 4 రెట్లు సేంద్రియ సాగును పెంచాలని భావిస్తున్నది.
ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి డిమాండ్
రాష్ట్రంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటున్నది. గ్రామాల్లో అందుబాటులో ఉండే కంపోస్ట్ ఎరువు, పశువుల పేడ, గో మూత్రం, బెల్లం, వేప ఆకు, వేప పండ్లు, రేగడి మట్టి ఇలా సహజ సిద్ధంగా లభ్యమయ్యే వాటిని వినియోగించి పంట సాగు చేస్తున్నారు. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు నాణ్యమైనవిగా.. ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విధంగా ఉంటున్నాయి. దీంతో రాష్ట్రంలోనూ వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. రసాయనాల ద్వారా పండే పంటల కంటే ఆర్గానిక్ పంటలకు రెట్టింపు ధరలు పలుకుతున్నాయి.
దీంతో రైతాంగం క్రమంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. మన లోకల్ మార్కెట్‌లో బిజినెస్ రూ.1500 కోట్లు జరుగుతున్నదని మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 రెట్లు ఆర్గానిక్ సాగును ప్రోత్సహిస్తే ఆర్గానిక్ బిజినెస్మరో నాలుగింతలు పెరిగే చాన్స్ ఉన్నదని చెబుతున్నారు.