- ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపిక
- పీఎం కుసుమ్ ప్రోగ్రాం కింద అమలు
- భూములు సర్వే చేస్తున్న అధికారులు
భద్రాచలం, వెలుగు : పోడు భూముల్లో సోలార్‌పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్‌ప్రాజెక్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎంపిక చేసింది. పీఎం కుసుమ్ ప్రోగ్రామ్ కింద ప్రాజెక్ట్ ను అమలు చేయనుంది. రాష్ట్రంలో 500 ఎకరాల్లో ప్రాజెక్ట్ ను చేపట్టనుండగా భద్రాద్రి జిల్లాకు 200 ఎకరాలను కేటాయించారు. ఆదివాసీ రైతులకు పోడు భూములకు పట్టాలు ఎక్కువగా ఇచ్చిన జిల్లా ఇదే. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటలు పండక, అప్పుల ఉన్న రైతులను ఆదుకుని ఆదాయం కల్పించేందుకు ప్రోగ్రామ్ కు ఐటీడీఏ పీవో బి.రాహుల్ రూపకల్పన చేశారు.
కావలసిన భూములకు రెవెన్యూ, ట్రాన్స్ కో, ఐకేపీ(ఇందిరాక్రాంతి పథం), అగ్రికల్చర్, అటవీహక్కుల చట్టం ఆఫీసర్లతో కూడిన టీమ్ లు సర్వే చేపట్టాయి. ఇప్పటికే జిల్లాలోని 59 విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో అనువైన పోడు భూముల ఎంపిక కోసం సర్వే నిర్వహిస్తున్నారు.
దగ్గర్లో విద్యుత్ సబ్‌స్టేషన్ మస్ట్
పోడు భూమికి దగ్గర్లో మూడు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా విద్యుత్ సబ్స్టేషన్ఉండాలి. విద్యుత్ లైన్‌ను నిర్మించి సోలార్‌ప్లాంట్ల నుంచి జనరేట్ అయిన విద్యుత్‌ను సబ్ స్టేషన్లకు తీసుకెళ్తారు. ప్రతి నాలుగు ఎకరాల్లో ఒక మెగావాట్ప్లాంటును ఏర్పాటు చేసి విద్యుత్‌ను జనరేట్చేస్తారు. పోడు రైతు ఇంట్లో ఒకరు స్వయం సహాయక సంఘంలో సభ్యులై ఉండాలి. రైతు పేరు మీదనే ఎంఓయూ చేసుకుంటారు. ప్లాంటు ఏర్పాటుకు వడ్డీ లేని రుణాలను అందిస్తారు. 70 శాతం బ్యాంకు రుణం, మిగిలిన 30శాతం రైతు చెల్లించాలి.
ALSO READ : మీసేవలో 9 కొత్త సర్వీసులు ప్రారంభం : మేనేజర్ దేవేందర్
అయితే ఆదివాసీ రైతులకు ట్రైకార్ద్వారా 20 శాతం చెల్లించేందుకు ఐటీడీఏ ముందుకొచ్చింది. రైతు కేవలం 10శాతం వాటాను చెల్లిస్తే సరిపోతుంది. ఒక మెగా వాట్ప్లాంటు నుంచి ఏడాదికి 15 లక్షల యూనిట్ల విద్యుత్‌ఉత్పత్తి అవుతుంది. దీనిపై రూ.45లక్షల ఆదాయం వస్తే, బ్యాంకు లోన్లు రూ.20లక్షలు పోయినా సుమారు రూ.25లక్షలు పోడు రైతు అకౌంట్లో జమ చేస్తారు.
పర్యావరణ పరిరక్షణకు ఉపయోగం
విద్యుత్ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, వాటర్, గ్యాస్ వనరులు తగ్గుతుండగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్విద్యుత్ పై దృష్టి సారించింది. ఇదైతే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో ఉపయోగకంగా ఉంటుంది. పంటలు పండక పడావు పడిన భూముల్లో సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేస్తే తద్వారా రైతుకు ఆదాయం వస్తుంది. గిరిజన గ్రామాల్లో విద్యుత్‌వెలుగులు, పక్కన ఉన్న భూములకు సాగునీటికి విద్యుత్‌మోటార్లకు కూడా ఉపయోగించుకోవచ్చు. పీఎం కుసుమ్పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి పథకం కింద అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఎంతో లాభదాయకం
సోలార్ ప్లాంట్లు ఆదివాసీలకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ఇందిరా మహిళాశక్తి పథకం కింద స్థానిక నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పోడు భూముల్లో ప్లాంట్లు ద్వారా రైతులకు భారీగానే ఆదాయం వస్తుంది. ఎలాంటి వివాదాలు లేని భూములను సర్వే టీమ్ లు ఎంపిక చేయాలి. – బి.రాహుల్ఐ టీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్, భద్రాచలం