హైదరాబాద్, వెలుగు: పోడు భూముల సర్వే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీలకు అప్పగించింది. రెండు నెలలుగా సెక్రటరీలు ఇదే డ్యూటీల్లో నిమగ్నమై ఉన్నారు. రైతుల నుంచి వచ్చిన అప్లికేషన్లలో ఏది రిజెక్ట్ చేయాలో, ఏది అంగీకరించాలో సెక్రటరీలే డిసైడ్ చేసి లిస్టు పంపాలని కలెక్టర్ల నుంచి ఆదేశాలున్నాయి. అయితే పోడు భూముల సర్వేలో పూర్తి బాధ్యతలు అప్పగించడంపై సెక్రటరీలు ఫైర్ అవుతున్నారు. గ్రామస్థాయి కమిటీలో ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఉన్నప్పటికీ వారు గ్రామ సభలకు అటెండ్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం గ్రామ సభను ఏర్పాటు చేసే బాధ్యత సెక్రటరీలదని, భూములు ఎవరికి ఇవ్వాలో అనేది తామెలా డిసైడ్ చేస్తామని అంటున్నారు. ఇటీవల కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎఫ్ ఆర్ వో హత్య తర్వాత భూముల సర్వే డ్యూటీ చేయడానికి ఇతర శాఖల అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో సెక్రటరీలకు ప్రభుత్వం సర్వే డ్యూటీని అప్పగించింది.
ఇప్పటికే పనిభారం.. కొత్తగా ఈ బాధ్యతలు
రాష్ట్రంలో వీఆర్వోలను ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన తర్వాత వారి డ్యూటీలను సెక్రటరీలకు అప్పగించింది. దీంతో వివిధ రకాల పనులను వీరు చూస్తున్నారు. ఇప్పుడు పోడు భూముల సర్వే బాధ్యతలు అప్పగించడం న్యాయం కాదని అంటున్నారు.
ఆందోళనలు చేస్తున్న సెక్రటరీలు
పోడు భూముల వ్యవహార బాధ్యతలు తమకు వద్దని రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరీలు నిరసన తెలుపుతున్నారు. అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్)ను, ఆర్డీవోలను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పోడు భూముల అంశంలో జోక్యానికి నిరాకరిస్తుండడంతో తాము కూడా ఈ బాధ్యతలు తీసుకోబోమని చెబుతున్నారు.
వివాదాస్పద భూములతో తలనొప్పులు
పోడు భూముల హక్కుదారుడిని ఖరారు చేసే విషయంలో తమపై దాడులు జరిగే అవకాశాలున్నాయని సెక్రటరీలు భయపడుతున్నారు. ఒకే భూమిపై ఇద్దరు ముగ్గురు.. తమదంటే తమదని గొడవలకు దిగుతున్నారని అంటున్నారు. ఇటీవల పంచాయతీలను విడదీయడంతో ఆయా గ్రామాల మధ్య పోడు భూముల వ్యవహారం వివాదాలకు దారి తీసింది. గతంలో ఈ భూములు ఒక గ్రామ పంచాయతీలో ఉండగా ఇప్పుడవి మరో గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చాయి. గతంలో ఒకరు సాగు చేసుకోగా ఇప్పుడు మరొకరు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో గొడవలు పడుతున్నారు. ఇలాంటి వివాదాస్పద భూములపై నిర్ణయం తీసుకోవడం సెక్రటరీలకు ఇబ్బందిగా మారింది.