పాలమూరుపై సర్కార్​ ఫోకస్​

పాలమూరుపై సర్కార్​ ఫోకస్​
  • టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.37.87 కోట్లు మంజూరు
  • సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి ఫండ్స్​ కేటాయింపు
  • అసంపూర్తి బిల్డింగ్​లు కంప్లీట్​ చేయాలని నిర్ణయం
  • నాలెడ్జ్​ హబ్, టాస్క్ కు కేటాయించేందుకు ప్రపోజల్స్

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్​నగర్  డెవలప్​మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. లోకల్​ బాడీ ఎమ్మెల్సీ బై పోల్, పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ కారణంగా నాలుగు నెలలుగా అభివృద్ధి పనులకు బ్రేక్​ పడగా, ఇటీవల కోడ్​ ముగియడంతో యుద్ధప్రాతిపదికన డెవలప్​మెంట్​ వర్క్స్​ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్​ ఆధారంగా అభివృద్ధి పనులను టేకప్   చేస్తోంది. 

రూ.37 కోట్లతో డ్రైన్లు, సీసీ రోడ్లు

మహబూబ్​నగర్​ మున్సిపాల్టీలో ఏండ్లుగా కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు లేవు. అలాగే అండర్​ డ్రైనేజీలు లేక ఏటా వర్షాకాలంలో మురుగు నీరంతా ఇండ్లలోకి చేరుతోంది. దీనిపై మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డికి ప్రజల నుంచిఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. తమ కాలనీల్లో సీసీ రోడ్లతో పాటు అండర్​ డ్రైనేజీలు నిర్మించాని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కొద్ది రోజులుగా మున్సిపల్  చైర్​పర్సన్​ ఆనంద్​ కుమార్​గౌడ్, ఆఫీసర్లతో ఫీల్డ్​ ఎంక్వైరీ చేయించి రిపోర్ట్​ తెప్పించుకున్నారు. దీని ఆధారంగా ప్రపోజల్స్​ రూపొందించారు.

తెలంగాణ అర్బన్​ ఫైనాన్స్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ ద్వారా రూ.37.87 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో బీకే రెడ్డి కాలనీ నుంచి పెద్ద చెరువు వరకు ముంపు నివారణకు రూ.3 కోట్లతో, రహిస్సా మసీద్​ వెనక భాగం నుంచి గోల్​ మసీదు మెయిన్​రోడ్డు వరకు రూ.4 కోట్లతో స్ట్రోమ్​ వాటర్ డ్రైన్లను నిర్మించనున్నారు. అలాగే రూ.30.87 కోట్లతో తిమ్మసానిపల్లి, వెంకటేశ్వర కాలనీ, ఏనుగొండ, లక్ష్మీనగర్ కాలనీ, అప్పన్నపల్లి, శ్రీరామ్ నగర్, బీసీ కాలనీ, ఎదిర, చైతన్య నగర్, సగర కాలనీ

 శ్రీనివాస కాలనీ, ద్వారకాపురి, పాలకొండ, బోయపల్లి, దొడ్డలోనిపల్లి, టీచర్స్ కాలనీ, షాషబ్​గుట్ట, బాలాజీ నగర్, శేషాద్రినగర్, మహేశ్వరి కాలనీ, బీకే రెడ్డి కాలనీ, నరేంద్ర నగర్, మైత్రి నగర్, శివశక్తి నగర్, రామయ్య బౌలి, తయాబ్ నగర్, బండ్ల గేరి, వేపూరి గేరి, రాంనగర్, రవీంద్రనగర్, బ్రాహ్మణవాడి, మోనప్పగుట్ట, హనుమాన్ పుర, బండమీదిపల్లి, కోయిలకొండ క్రాస్ రోడ్, చిరుమల్​కుచ్చ​తండా, కల్వరి కొండ, న్యూ మోతినగర్, టీడీ గుట్ట, సుభాశ్ నగర్, న్యూ గంజ్, ఎర్ర సత్యం చౌరస్తా, బాయమ్మ తోట ప్రాంతాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయనన్నారు.

ఎడ్యుకేషన్​ డెవలప్​మెంట్​కు..

గత ప్రభుత్వం జిల్లాలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు ఇష్టానుసారంగా భూ కేటాయింపులు చేశారు. న్యూ టౌన్​లోని పాత ఆర్అండ్​బీ గెస్ట్​ హౌస్​ను కూల్చి వెజిటేబుల్​ మార్కెట్​కు కేటాయించింది. 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. బిల్లులు రాకపోవడంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ స్థలాన్ని నాలెడ్జ్​ హబ్ కు​కేటాయించేందుకు ఎమ్మెల్యే రెడీ అయ్యారు. ఇక్కడ లైబ్రెరీతో పాటు రీడింగ్​సెంటర్​ను ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్​సిద్ధం చేశారు. అలాగే 2018లో మెట్టుగడ్డ వద్ద ఉన్న డైట్​ కాలేజీకి చెందిన స్థలాన్ని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించింది.

కాలేజ్​ స్థలాన్ని మార్కెట్ కు​కేటాయించొద్దని స్టూడెంట్లు అప్పట్లోనే ధర్నా చేసినా పట్టించుకోలేదు. అయితే ఎమ్మెల్యే యెన్నం ఈ భవనాన్ని ‘టాస్క్’ కు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ప్రారంభం కానున్న ఈ సెంటర్​ను త్వరలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ‘టాస్క్’ యూనివర్సిటీగా డెవలప్​ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ బిల్డింగ్​ జిల్లా కేంద్రానికి నడిబొడ్డులో ఉండడం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

డెవలప్​మెంట్​ వర్క్స్​ స్పీడప్​ చేస్తున్నాం..

మహబూబ్​నగర్​లో ఎంత వర్షం వచ్చినా వరద నీరు కాలనీల్లోకి రాకుండా డ్రైనేజీలు నిర్మించేందుకు ప్లాన్​ చేస్తున్నాం. ఇందుకోసం రూ.37 కోట్లతో డ్రైనేజీలు, వరద కాలువలను నిర్మిస్తున్నాం. రూ.260 కోట్ల ఫండ్స్​ వచ్చాయి. వీటికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. అలాగే రూ.600 కోట్ల ఫండ్స్​ కోసం కేంద్రానికి ప్రపోజల్స్​ పంపాం.

యెన్నం శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్