- డీపీఆర్ తయారు కోసం ప్రైవేటు కన్సల్టెన్సీ సర్వే
- ప్రతిసారీ ఎన్నికల హామీగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
- సీఎం చొరవతో ముందడుగు
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ఏర్పాటుపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. వరంగల్నగరానికి దాదాపు 30 ఏండ్ల కింద రావాల్సిన యూజీడీ ప్రాజెక్ట్ సమైక్య రాష్ట్రంలో వెనక్కిపోయింది. అనంతరం ఉమ్మడి వరంగల్జిల్లాలో ఏ ఎన్నికలొచ్చినా రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి అడుగు వేసింది.
ఇందులో భాగంగా సర్వే కంపెనీలు సిటీలో పర్యటించాయి. డీపీఆర్ తయారీకి సంబంధించి చేసే సర్వే విధానాన్ని గ్రేటర్ పాలకమండలి, బల్దియా అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ప్రధానులు, సీఎంల మార్పు ఎఫెక్ట్
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా.. 1996లో రూ.110 కోట్లతో డీపీఆర్ తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. అయితే 1996 నుంచి 1998 వరకు దేశంలో అయిదుగురు ప్రధానులు మారారు. రాష్ట్రంలోనూ ఏడాది తేడాతో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే 2005, 2009లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా జైపాల్‌రెడ్డి సమయంలో మరోసారి యూజీడీ కోసం చొరవ చూపినా ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయి అడుగులు పడలేదు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫోకస్‌తో.. సర్వే
అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలోనూ మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ప్రతి రివ్యూలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుపై చర్చించారు. త్వరగా డీపీఆర్ తయారు చేయాలని పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న బెంగళూర్‌కు చెందిన శుభ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు గ్రేటర్ వరంగల్లో పర్యటించారు.
మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, ఎన్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, కుడా, ట్రాఫిక్ పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇరిగేషన్, ఎన్ఐటీ అధికారులతో సమావేశమయ్యారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ (వరద నీటి కాలువలు), అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై సిస్టం, ఆక్విఫర్ మేనేజ్మెంట్ ప్లాన్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనపై నగరంలో వారు చేపట్టబోయే సర్వేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 24న గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ ఎమ్మెల్యేలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ డీపీఆర్ అంశంపై చర్చించారు.
2050లో జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఆధారంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ రూపొందిస్తున్నట్లు నిమగ్నమైనట్లు చెప్పారు. త్వరలోనే అధికారులు, స్టేక్ హోల్డర్స్లను భాగస్వామ్యం చేస్తూ విస్తృతస్థాయిలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మేయర్
తెలిపారు.
రెండు టర్మ్ లలో కేసీఆర్‌హామీ.. నెరవేర్చలే
కేసీఆర్ 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచే వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో దానిని ఏర్పాటు చేసుకుంటామని ప్రచారం చేశారు. తీరా కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో సీఎం హోదాలో గ్రేటర్ వరంగల్లో పర్యటించారు. అప్పటికే బల్దియా గ్రేటర్ కార్పొరేషన్‌గా అవతరించింది.
కాగా, సీటీ పర్యటన అనంతరం నగరంలోని నందన గార్డెన్లో మీటింగ్ పెట్టి వరంగల్ సిటీలో త్వరలోనే యూజీడీ పూర్తి చేస్తామని చెప్పివెళ్లారు. కాగా, 2023 వరకు రెండు టర్ములు రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నా.. వారు చెప్పినట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ వైపు చూడలేదు.