చెత్త కష్టాలకు చెక్​.. ఓరుగల్లు డంపింగ్​ యార్డుపై సర్కారు ఫోకస్

  • రాంపూర్, మడికొండ యార్డు నిండడంతో ఇబ్బందులు
  • వరంగల్- ఖమ్మం రూట్ కు మార్చేందుకు ప్రపోజల్స్

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు డంపింగ్​యార్డు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాంపూర్, మడికొండ సమీపంలోని డంపింగ్​యార్డు నిండిపోవడంతో చుట్టు పక్కల గ్రామాలకు ఇబ్బందిగా మారింది. నగర పరిస్థితులు, ఆయా గ్రామాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లీడర్లు, ఆఫీసర్లు దృష్టిపెట్టారు. ఇటీవల ఉమ్మడి వరంగల్​జిల్లా అభివృద్ధిపై ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్​లో రివ్యూ మీటింగ్​నిర్వహించగా, డంపింగ్​యార్డు షిఫ్టింగ్​గురించి చర్చించారు. ఈ మేరకు వరంగల్-ఖమ్మం హైవే రూట్ లో కొత్త డంపింగ్​యార్డును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, అధికారులు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నారు.

చెత్త నిండిపోయి సమస్యలు..

గ్రేటర్ వరంగల్ నగరం 66 డివిజన్ల పరిధిలో 2.25 లక్షల ఇండ్లు, 11 లక్షల జనాభా ఉండగా, నిత్యం 400 నుంచి 450 టన్నుల వరకు తడి, పొడి చెత్త వెలువడుతోంది. ఆ చెత్తనంతా వేసేందుకు 2007లో రాంపూర్, మడికొండ గ్రామాల శివారులో దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన డంపింగ్​యార్డుకు తరలిస్తున్నారు. రెండేండ్ల కిందటి వరకు అక్కడ 5 లక్షల టన్నుల వరకు వ్యర్థాలు పోగవగా, అందులో 3 లక్షల టన్నుల చెత్తను శుద్ధి చేసి, ఎరువుగా మార్చేందుకు 2021లో స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.36 కోట్లతో బయో మైనింగ్ చేపట్టారు. 

ఏడాదిలోనే 3 లక్షల టన్నుల చెత్త శుద్ధీకరణ పూర్తవాల్సి ఉండగా, మొదట్లో బడ్జెట్ సమస్యలు, ఆ తర్వాత వర్షాలు, తదితర కారణాల వల్ల ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. పాత చెత్త ఉండగానే, రోజురోజుకు పోగవుతున్న చెత్తతో డంపింగ్​యార్డు నిండిపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఇదే డంపింగ్​యార్డులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చెత్త నుంచి పవర్ జనరేషన్ ప్లాంట్, గోబర్ ధన్ స్కీంలో భాగంగా బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కూడా కసరత్తు చేశారు. కానీ, కాగితాల దశ కూడా దాటక చెత్త మొత్తం గుట్టలుగా పేరుకుపోయింది. అడపాదడపా డంపింగ్​యార్డు చెత్త నుంచి వచ్చే పొగ వ్యాపించి చుట్టుపక్కల ఉన్న రాంపూర్, మడికొండ, అయోధ్యపురం, టేకులగూడెం, తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

తొందర్లోనే స్థల సేకరణ..

గతంలో సిటీకి నాలుగు వైపులా డంపింగ్​యార్డులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. స్థల సమస్యలు ఏర్పడటంతో ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. దీంతో నగర శివారుల్లోని ఓపెన్ ప్లేసులు కూడా డంప్ యార్డులను తలపిస్తున్నాయి. వరంగల్ నగరానికి డంపింగ్​యార్డు సమస్య తీవ్రంగా కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు డంపింగ్​యార్డును తరలింపుపై హామీ ఇచ్చారు. ఈ మేరకు డంపింగ్​యార్డుపై దృష్టి పెట్టిన నేతలుతాజాగా జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి నేతృత్వంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో ప్రస్తావించారు. 

ఉన్న డంపింగ్​యార్డుకు ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వరంగల్​-ఖమ్మం హైవే మార్గంలో దానిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. గతంలో కక్కిరాలపల్లి సమీపంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరగగా, ఇప్పుడు కూడా అటు వైపే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అవసరమైన భూమిని సేకరించాలని మంత్రి పొంగులేటి గ్రేటర్ అధికారులను కూడా ఆదేశించారు. దీంతో తొందర్లోనే స్థలాన్ని సేకరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

 వరంగల్ మాస్టర్ ప్లాన్​, భవిష్యత్తు అవసరాలు, రాబోయే ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. దీంతో తొందర్లోనే గ్రామాలకు దూరంగా కొత్తగా డంపింగ్​యార్డు ఏర్పడే అవకాశం ఉంది. తమకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మడికొండ, రాంపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లీడర్లు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.