- బాక్స్ డ్రెయిన్స్, చెరువుల్లో పూడిక తీతకు రూ.5 కోట్లు మంజూరు
- మున్సిపల్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనులు
మహబూబ్‌నగర్, వెలుగు: ముంపు ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలు, మున్సిపాల్టీల్లో వరద నివారణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. దాదాపు రూ.5 కోట్లతో చెరువుల తూములు, నాలాల డెవలప్మెంట్ పనులు ప్రారంభించింది. పది రోజుల టార్గెట్ పెట్టుకొని జెట్ స్పీడుతో పనులు చేయిస్తోంది.
రూ.5 కోట్లతో పనులు..
మహబూబ్‌నగర్‌లోని పెద్ద చెరువుకు తెట్టె చెరువు, దొడ్లోనిపల్లి చెరువు, గాండ్ల చెరువుల నాలాల ద్వారా వరద వస్తోంది. వర్షాలు పడినప్పుడు ప్రేమ్‌నగర్, స్టేషన్ చౌరస్తా, బాయమ్మతోట, షాషబ్‌గుట్ట, న్యూటౌన్, కొత్తగంజ్, సుభాష్‌నగర్, కలెక్టర్ బంగ్లా, మోనప్పగుట్ట, టీడీగుట్ట, కోయిల్‌కొండ క్రాస్ రోడ్, బస్టాండ్ చౌరస్తా, వేపూరి గేరి నాలాల ద్వారా కూడా వరద చేరుతోంది. అయితే ఈ చెరువు నిండితే సమస్యలు వస్తున్నాయి. చెరువుకు కుడి, ఎడమ వైపు రెండు అలుగులు ఉండగా, ఇవి అలుగు పోస్తే దిగువున ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.
బీకే రెడ్డి కాలనీ వైపు ఉన్న అలుగు వరకు వస్తున్న నాలాలు 30 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్లతో ఉండగా, అలుగు దిగువన ఉన్న కాల్వలు మూడు ఫీట్ల వెడల్పు, రెండు ఫీట్ల లోతు మాత్రమే ఉన్నాయి. దీంతో వరద ఉధృతి పెరిగితే నీరు బయబకు వచ్చి దిగువన ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ చేశారు. రాష్ట్ర సర్కారు నుంచి రూ.5 కోట్ల ఫండ్స్ మంజూరు చేయించారు. ఈ ఫండ్స్‌తో జిల్లా కేంద్రంలోని చెరువులు, తూములు, అలుగు రిపేర్లు చేయిస్తున్నారు. మున్సిపల్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లు ఈ పనులు చేస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డ్రైన్ పనులు, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయి.
వరద కాల్వ నిర్మాణం..
బీకే రెడ్డి కాలనీవైపు ఉన్న అలుగుతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎక్కువ అవుతోంది. ఈ అలుగు వద్ద వరదను డైవర్ట్ చేయడానికి వరద కాల్వను నిర్మిస్తున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా, కొంత మైనర్ వర్క్స్ మిగిలి ఉన్నాయి. ఈ కాల్వను 40 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల ఎత్తుతో నిర్మించారు. వచ్చిన నిధుల్లో 60 శాతం ఈ కాల్వ కోసమే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు మొదలై చెరువుకు వరద వస్తే బీకే రెడ్డి కాలనీవైపు ఉన్న అలుగు నుంచి వచ్చే నీటిని ఈ కాల్వ మీదుగా డైవర్ట్ చేస్తారు. అనంతరం కాలనీవైపు ఉన్న చిన్న నాలా నుంచి అలుగుకు ఉన్న లింక్‌ను కట్ చేయనున్నారు.
అలాగే అవసరం ఉన్న చోట్ల బాక్స్ డ్రెయిన్స్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఇదే చెరువుకు శిల్పారామం మార్గంలో ఉన్న అలుగు వద్ద కూడా రిపేర్లు చేశారు. ఈ అలుగు నుంచి దిగువకు నీరు రాకుండా కట్టలు నిర్మించారు. ఇక్కడి నుంచి వచ్చే వరదను అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లేలా ప్లాన్ చేసి, పనులు పూర్తి చేశారు. ఈ చెరువుతో పాటు చిక్కుడు వాగు, కొత్త చెరువులో కూడా నాలాల రిపేర్లు చేస్తున్నారు. వీటిలో కూడా పూడికతీత పనులు చేపడుతున్నారు. రానున్న వారంలో ఈ పనులు పూర్తి కానున్నాయి.
ఆక్రమణలతోనే ముంపు సమస్య..
గత ప్రభుత్వంలోని పెద్దలు ఈ చెరువును పట్టించుకోలేదు. మినీ ట్యాంక్ బండ్‌గా డెవలప్ చేస్తామని చెప్పి, పనులు పూర్తి చేయలేదు. డెవలప్మెంట్ పేరుతో గతేడాది వరకు చెరువులోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలించారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్ట్ సంస్థ ఈ చెరువు నుంచి పెద్ద మొత్తంలో ఒండ్రు మట్టిని తరలించి కోట్లు సంపాదింకుందనే విమర్శలున్నాయి. దీనికితోడు కొందరు ఆఫీసర్లు సహకారం అందించడంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. అలాగే చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడంతో దిగువన ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయని అంటున్నారు.
బాక్స్ డ్రెయిన్స్ కట్టిస్తున్నాం..
పెద్ద చెరువు దిగువ ప్రాంతం ముంపునకు గురవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీన్ని నివారించేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయించా. వరద నీరు కాలనీలకు వెళ్లకుండా బాక్స్ డ్రెయిన్స్ కట్టిస్తున్నాం. ఎర్రకుంట చెరువు నుంచి కూడా నీరు ఇళ్లలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడికక్కడ ట్రంచ్‌లు కొట్టిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని అన్ని నాలాలను రిపేర్లు చేయించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలాల పనులు కూడా పూర్తి చేయిస్తాం.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే
రెండు వారాల్లో పూర్తి చేస్తాం..
మున్సిపల్, పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధర్యంలో వరద నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మా పరిధిలోని నాలాల్లో డీసిల్టింగ్ చేస్తున్నాం. చెరువుల్లో పూడికను తీస్తున్నాం. చెరువుల నుంచి తీసిన షిల్ట్‌ను ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నాం. అలాగే వరద వచ్చే సమయంలో చెరువుల్లోకి చెత్త రాకుండా నెట్స్ కూడా ఏర్పాటు చేశాం. పెద్ద చెరువు పరిధిలో వరద కాల్వ పనులు జరుగుతుండగా, పబ్లిక్అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధర్యంలో ఈ పనులు నడుస్తున్నాయి. రెండు వారాల్లో ఈ పనులన్ని కంప్లీట్ అవుతాయి.
మహేశ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్