హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్స్, ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర సర్కార్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 2012లో జారీ చేసిన బిల్డింగ్ రూల్స్ జీవోకు సవరణలు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన నిబంధన ప్రకారం... అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాల్లో సెట్ బ్యాక్ లు, ఎత్తు, ఫైర్ ఎన్ఓసీ వంటి నిబంధనలను పాటించాలి. ఈ నిర్మాణాలు చేపట్టిన బిల్డింగ్ ఓనర్లు 33 శాతం పెనాల్టీకి సమానమైన విలువ కలిగిన ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్ ) చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల నిర్మించే భవనాల పర్మిషన్‌కు టీడీఆర్ చార్జీలు చెల్లించే విధానాన్ని ఇప్పుడు హెచ్ఎండీఏ పరిధికి విస్తరిస్తూ రూల్స్‌లో సవరణ చేశారు. కొత్త రూల్స్ ప్రకారం.. ఉదాహరణకు: ఒక భవనం నిర్మించేందుకు అనుమతి కోసం స్థానిక సంస్థల వద్దకు వెళ్లినప్పుడు మొత్తం ఫీజు రూ. 20 లక్షలు అవుతుందనుకుంటే.. అందులో 33 శాతం అంటే సుమారు రూ.6.6 లక్షల విలువ గల టీడీఆర్‌ను కొనుగోలు చేస్తే ఆ అక్రమ నిర్మాణం రెగ్యులరైజ్ చేస్తారు.
వాస్తవానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండా అనధికార నిర్మాణాలు చేపట్టి, నిర్మాణానంతరం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే.. పర్మిషన్ చార్జీలతోపాటు, ఇందులో అదనంగా 33 శాతం జరిమానాగా వసూలు చేసుకుని అనుమతులు జారీ చేస్తున్నారు. అదేవిధంగా పది శాతం పరిమిత డీవియేషన్స్ తో నిర్మాణాలు చేపట్టిన వారికి కాంపౌండింగ్ ఫీజు విధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను ఇస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్(బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం)పై కోర్టులో కేసు నడుస్తున్నది. దీంతో సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎలా అమలు అవుతుందనేది వేచి చూడాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆదాయం కోసమే ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో మార్పులు తెచ్చి.. చాకచక్యంగా రెగ్యులరైజేషన్‌కు అనుమతిచ్చిందని వారు చెప్తున్నారు.