
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి ఒలింపిక్ చాంపియన్లను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం, సోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ముందుకెళ్తున్నాయని శాట్ చైర్మన్ కె. శివసేనారెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. కెఐఓ నేషనల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలను గురువారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శివసేనారెడ్డి ప్రారంభించారు.
ఈ టోర్నీలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. కాగా, శుక్రవారం జరిగే పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ కరాటే డూ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గచ్చిబౌలి స్టేడియానికి రానున్నారు.