లోకల్ యూత్కే జాబ్స్..వరంగల్లో మెగా జాబ్ మేళా

లోకల్ యూత్కే జాబ్స్..వరంగల్లో మెగా జాబ్ మేళా
  • ఉద్యోగాలు కల్పించేందుకు నియోజకవర్గాల వారీగా చర్యలు
  • ఇప్పటికే వరంగల్ వెస్ట్, పరకాలలో కంప్లీట్
  • నేడు వరంగల్ ఈస్ట్ లో నిర్వహణ
  • 26 న భూపాలపల్లిలో ఏర్పాటు

హనుమకొండ, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం 'ప్లేస్ మెంట్స్ ఫర్​ లోకల్​ యూత్'​ పేరుతో  ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను నిరుద్యోగులకు చేరువ చేస్తోంది.  తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్​అండ్​నాలెడ్జ్(టాస్క్​) ఆధ్వర్యంలో  సెవెన్త్, టెన్త్, ఇంటర్, ఐటీఐ వివిధ కోర్సులు చేసిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది.  ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మెగా జాబ్​మేళాలు నిర్వహిస్తున్నారు. పదుల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగుల ఉపాధికి బాటలు వేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లాలోని వరంగల్ వెస్ట్, పరకాల నియోజకవర్గాల్లో వందలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించగా.. మిగతా నియోజకవర్గాల్లో కూడా మెగా జాబ్​మేళాలు నిర్వహించేందుకు అక్కడి లీడర్లు కసరత్తు చేస్తున్నారు.

రెండు చోట్లా.. వెయ్యి మందికిపైగా..

రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్​ చేయక చాలామంది  తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వయసు దాటి పోతుండటంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  దీంతో కాంగ్రెస్​ ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది.  టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్​ వన్, టూ, త్రీ, ఫోర్, తదితర నోటిఫికేషన్లు రిలీజ్​ చేసి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అందులోనూ ఉద్యోగావకాశం దక్కని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టి టాస్క్​ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సౌజన్యంతో జాబ్​ మేళాలు నిర్వహిస్తోంది.

దీనిని సద్వినియోగం చేసుకుంటూ ఓరుగల్లు జిల్లా లీడర్లు స్థానిక యువతకు ఉపాధి కల్పనపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఇందులో భాగంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి గతేడాది ఫిబ్రవరిలో ఓసారి, ఈ ఏడాది మార్చి 23న మరోసారి హనుమకొండలో జాబ్​ మేళా నిర్వహించారు. మొత్తంగా 500 మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ నెల 4న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి  మెగా జాబ్​ మేళా నిర్వహించారు. 52కుపైగా కంపెనీల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ మెగా జాబ్​ మేళాలో 500 మందికి పైగా ఉద్యోగావకాశాలు దక్కగా..  మరో 1400 మందిని వివిధ కంపెనీలు షార్ట్​ లిస్ట్ చేశాయి. కంపెనీల అవసరాన్ని బట్టి వారికీ విడతలవారీగా ఉద్యోగాలు కల్పించనున్నాయి.

నేడు వరంగల్ ఈస్ట్.. 26న భూపాలపల్లి

టాస్క్​ ఆధ్వర్యంలో 'ప్లేస్​ మెంట్స్ ఫర్​ లోకల్​ యూత్'లో భాగంగా మంత్రి కొండా సురేఖ, తన సొంత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్​ లో ఈ నెల 11న (శుక్రవారం) మెగా జాబ్​ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్​ మేళాలో జెన్‌ ప్యాక్ట్, భారత్​ బయోటెక్, హెచ్​డీబీ, పేటీఎం, జీఎంఆర్, జస్ట్ డయల్, అపోలో ఫార్మసీ, ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్, ఐడీబీఐ బ్యాంక్ తదితర 50కిపైగా పేరుమోసిన కంపెనీలు పాల్గొననున్నాయి.  

వరంగల్ రైల్వే స్టేషన్​ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్​ హాలులో ఉదయం 9.30 గంటలకు మెగా జాబ్​ మేళాను ప్రారంభించనుండగా..  ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు  మెగా జాబ్​ మేళా నిర్వహణకు ప్లాన్​ చేశారు. ఈ నెల 26న మెగా జాబ్​ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్​ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

తొందర్లోనే మిగతా నియోజకవర్గాల్లో..

మెగా జాబ్​ మేళాలో వివిధ రంగాలకు సంబంధించిన బడా కంపెనీలు పాల్గొంటున్నాయి. టెన్త్​, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ.. ఇలా వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి వందల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో స్కూల్​ స్టడీస్ తో చదువులు ఆపేసిన వాళ్లు కూడా జాబ్​ మేళాకు బారులు తీరుతున్నారు. కాగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి దొరుకుతుండటం, యూత్​ కు మరింత చేరువయ్యేందుకు అవకాశం కూడా ఉండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా మెగా జాబ్​ మేళాలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. మే నెలాఖరు వరకు అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతీ, యువకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.