వడ్ల కొనుగోలు టార్గెట్ ​5.88 లక్షల మెట్రిక్​ టన్నులు

వడ్ల కొనుగోలు టార్గెట్  ​5.88 లక్షల మెట్రిక్​ టన్నులు
  • మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 3.62 లక్షల ఎకరాల్లో వరి సాగు
  • రెండు జిల్లాల్లో 291 వడ్ల సెంటర్ల ఏర్పాటుకు చర్యలు
  • గత ప్రభుత్వ హయాంలో ఇన్​టైంకు ఓపెన్​ కాని సెంటర్లు
  • నిరుడు పెద్ద మొత్తంలో వడ్లను కర్నాటక వ్యాపారులకు అమ్ముకున్న రైతులు

మహబూబ్​నగర్​, వెలుగు: వడ్ల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రెండేండ్లుగా నిర్దేశించిన టార్గెట్​ మేరకు వడ్ల సేకరణ జరగకపోవడంతో.. ఈసారి లక్ష్యం మేరకు వడ్లను సేకరించాలని సివిల్​ సప్లయ్​ టార్గెట్​గా​పెట్టుకుంది. ఈ మేరకు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 291 కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి 5.88 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు సేకరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కోతలు మొదలైన ప్రాంతాల్లో రెండు రోజులుగా రైతుల నుంచి వడ్లను సేకరిస్తోంది.

3.62 లక్షల ఎకరాల్లో వరి సాగు..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో వానాకాలం సీజన్​లో 3.62 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో అత్యధికంగా పాలమూరులో 1,92,646 ఎకరాల్లో వరి పండించారు. 4,48,082  మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా.. ఇందులో సన్న రకం వడ్లు 3,85,632 మెట్రిక్​ టన్నులు, దొడ్డు రకం వడ్లు 62,450 మెట్రిక్  టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. స్థానిక అవసరాలకు 89,616 మెట్రిక్ టన్నులు, విత్తన తయారీకి 89,616 మెట్రిక్  టన్నులు పోను.. కొనుగోలు కేంద్రాలకు 2,31,379 మెట్రిక్​ టన్నుల సన్న రకం, 37,470 మెట్రిక్  టన్నుల దొడ్డు రకంతో కలిపి 2,68,850 మెట్రిక్  టన్నుల వడ్లు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 

ఇందుకు గాను ఐకేపీ ద్వారా 95,  పీఏసీఎస్​ ద్వారా 89,  డీసీఎంఎస్, మెప్మా ద్వారా ఒక్కో కొనుగోలు సెంటర్​తో కలిపి జిల్లాలో 189 సెంటర్ల ద్వారా వడ్ల సేకరణ చేపట్టనున్నారు. నారాయణపేట జిల్లాలో ఈ సీజన్​లో 1.70 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొత్తం 4.12 లక్షల మెట్రిక్​ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా ఉండగా.. ఇందులో 3.20 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 102 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 

పీఏసీఎస్​ ద్వారా 60 సెంటర్లు, ఐకేపీ ద్వారా 40, మెప్మా ద్వారా రెండు కేంద్రాలను తెరవనున్నారు. ఇందులో ఇప్పటికే 11 సెంటర్లను ఓపెన్​ చేసి రైతుల నుంచి వడ్లు కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రేడ్ -ఏ రకం వడ్లకు క్వింటాల్​కు రూ.2,320 చెల్లిస్తుండగా.. సాధారణ రకానికి రూ.2,300 చెల్లిస్తోంది. వీటితో పాటు సన్నాలకు అదనంగా రూ.500 బోనస్​ చెల్లించనుంది. 

టార్గెట్​ రీచ్​ అయ్యేనా?

గత ప్రభుత్వ హయాంలో సెంటర్ల ద్వారా రెండేండ్లుగా లక్ష్యం మేరకు రైతుల నుంచి వడ్లను సేకరించలేదు. వరి కోతలు ప్రారంభించినా సెంటర్లు తెరవడంలో ఆలస్యం చేయడంతో చాలా మంది రైతులు ప్రైవేట్​ వ్యాపారులకు వడ్లను అమ్ముకున్నారు. కొందరు మిల్లర్లు కూడా రైతుల నుంచే నేరుగా వడ్లను కొనుగోలు చేశారు. దీనికితోడు పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో వడ్లకు డిమాండ్  బాగా ఉండడంతో అక్కడి వ్యాపారులు కల్లాల వద్దకు వచ్చి పచ్చి వడ్లనే కొనుగోలు చేశారు.

 గత ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర కంటే రూ.300 నుంచి రూ.500 వరకు అదనంగా ఇవ్వడంతో ఎక్కువ మొత్తంలో కర్నాటక వ్యాపారులకు ఈ రెండు జిల్లాల రైతులు వడ్లను అమ్ముకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రైతులకు భరోసా ఏర్పడింది. దీనికితోడు కాంగ్రెస్​ ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధర ఇవ్వనుండడంతో పాటు రూ.500 బోనస్​ కూడా ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఈసారి టార్గెట్​కు అనుగుణంగా వడ్ల సేకరణ జరిగే అవవాశం ఉంది.

రెండేండ్లుగా సీఎంఆర్​ పెండింగ్..​

సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు రైస్​ మిల్లర్లకు సీఎంఆర్​ అలాట్​ చేస్తున్నా.. రైస్​ మిల్లర్లు ఇన్​ టైమ్​లో సీఎంఆర్​ ​ ఇవ్వడం లేదు. రెండేండ్లుగా పెండింగ్​లోనే పెడుతున్నారు. చాలా మంది మిల్లర్లు ప్రభుత్వం కేటాయిస్తున్న సీఎంఆర్​ను ఇతర ప్రాంతాల్లో అమ్ముకొని క్యాష్​ చేసుకున్నారనే టాక్​ ఉంది. ఇందులో కొందరు ఆఫీసర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గత ఐదు సీజన్ల నుంచి మహబూబ్​నగర్​ జిల్లాలో 20,000.966 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ పెండింగ్​లో ఉన్నట్లు సివిల్​ సప్లయ్​ లెక్కలు చెబుతున్నాయి.

ఇందులో 2022–-23 వానాకాలంలో 38.174 మెట్రిక్​ టన్నులు, వానాకాలం 2023–-24కు సంబంధించి 3,154.442, గత యాసంగిలో 16,810.350 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇందుకు గాను రైస్​ మిల్లర్లకు డెడ్​లైన్​ పెడుతున్నా.. సీఎంఆర్​ బియ్యాన్ని తిరిగి అప్పగించడం లేదు. ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంతో మిల్లర్లు కూడా సైలెంట్​గా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి.