మహబూబ్‌నగర్, వెలుగు: పరిశ్రమలు, గ్రానైట్, బంగారం, పట్టు చీరల ఉత్పత్తికి పేరు పొందిన వికారాబాద్, నారాయణపేట ప్రాంతాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రాష్ర్ట సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సౌజన్యంతో వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్‌పనులు చేపట్టాల్సి ఉండగా, ఏండ్లు కావస్తున్నా తెలంగాణ సర్కారు భూ సేకరణకు ముందుకు రావట్లేదు.
40 ఏండ్ల కిందటే సర్వే..
మొదటి సారిగా 1980లో వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్ తెరమీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టును చేపట్టాలని 1988లో రూ.90 కోట్లతో విరాకాబాద్ నుంచి పరిగి, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నారాయణపేట, కృష్ణ వరకు రైల్వే లైన్ నిర్మించాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సర్వే చేసినా రైల్వే బడ్జెట్ లో కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 20 ఏండ్ల తర్వాత 2008లో ఉమ్మడి ఏపీలోని అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు రీ సర్వే చేయించింది. దీనిలో మార్పులు చేసి రైల్వే లైన్‌ను వికారాబాద్ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌పేట, కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ(127 కిలోమీటర్లు) వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రూ.1,100 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. కేంద్ర, రాష్ర్టాలు 50 శాతం నిధులు ఖర్చు చేసేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ మేరకు అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్‌ఖర్గే పరిగి ప్రాంతంలో పర్యటించి పనులు చేపడతామని హామీ ఇచ్చినా ఆచరణ జరగలేదు.
ఎనిమిదేండ్లు అయినా స్పందిస్తలే..
రాష్ర్ట ఏర్పాటు అనంతరం 2014లో ఈ ప్రాజెక్టును రాష్ర్ట ప్రభుత్వం పట్టాలెక్కిస్తుందని భావించారు. రాష్ర్టం ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా టేకప్ చేయట్లేదు. 2017లో మరోసారి కేంద్రం ఈ పనులు చేసేందుకు అంగీకారం తెలిపినా, ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం రెస్పాండ్కాలేదు. ఇటీవల కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఈ విషయంపై లేఖ రాసినా ఆయన స్పందన లేదు. అయితే ఈ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు కానుంది. ఇంత ఖర్చు చేయలేక రాష్ర్టం వెనుకాడుతోందన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు భూసేకరణకు కూడా పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందనే పక్కకు పెట్టిందనే టాక్‌వస్తోంది.
రాయచూర్‌కు షార్ట్‌కట్...
పరిగి, కొడంగల్, దోమ, వికారాబాద్ప్రాంతాల నుంచి దాదాపు పది వేల మంది ఉద్యోగులు, స్టూడెంట్లు నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. నారాయణపేట ప్రాంతం నుంచి బంగారం, చీరల వ్యాపారాల నిమిత్తం రాయచూర్, గుల్బర్గా, మహారాష్ర్టల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైల్వే లైన్ఏర్పాటు ద్వారా వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని ప్రజలకు రవాణా భారం తగ్గనుంది. వికారాబాద్ నుంచి రాయచూర్వెళ్లడానికి కూడా షార్ట్ కట్ రూట్అవుతుంది.
పనులు చేయాలని లెటర్రాసినా రిప్లై లేదు..
2017లో రైల్వే శాఖ నుంచి రాష్ర్ట ప్రభు త్వానికి లెటర్ ఇచ్చారు. రైల్వే ట్రాక్నిర్మాణానికి భూమి చూపించాలని కోరి నా ఇంత వరకు రాష్ర్ట ప్రభుత్వం స్పందిం చడం లేదు. కొద్ది రోజుల కింద ఈ విష యంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు ఆ లెటర్‌కు రీప్లై కూడా లేదు.-
నాగూరావు నామాజీ, బీజేపీ స్టేట్ లీడర్, నారాయణపేట
సీఎం కేసీఆర్‌కు ఆసక్తి లేదు..
రాష్ర్ట ఏర్పాటు తర్వాత పరిగి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌ను వెళ్లి కలిశా. సీఎంకు ఈ ప్రాంతం మీద, వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్‌మీద ఆసక్తి లేదు. ఈ రైల్వే లైన్ అం శంపై అసెంబ్లీలో కూడా మాట్లాడా. కానీ శాంక్షన్ అయిన ఈ ప్రాజెక్టును తొక్కి పెట్టేసిండ్రు. ఈ రైల్వే లైన్ఏర్పాటు చేస్తే పరోక్షంగా పది వేల మంది ఉద్యోగులు, స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. ఆ విషయాన్ని రాష్ర్ట సర్కారు గుర్తిస్తలేదు.
–టి.రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే