బల్దియా నిధులను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 

బల్దియా నిధులను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 


    రెండేళ్లుగా స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ ఫీజులను ఇవట్లే
    స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి బల్దియాకు రావాల్సిన నిధులను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్​, వెలుగు: జీహెచ్ఎంసీకి వస్తున్న ఏ నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు.  అప్పుల్లో కూరుకుపోతున్న బల్దియాను ఆదుకోకపోగా.. కేంద్ర ప్రభుత్వం బల్దియాకు కేటాయిస్తున్న నిధులను కూడా వాడుకుంటోంది. వీటితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్​ శాఖ నుంచి బల్దియాకు రావాల్సిన స్టాంపు డ్యూటీ, మ్యుటేషన్ ఫీజులను సైతం ఇవ్వడం లేదు. 2020–21, 2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించి జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మ్యుటేషన్ ఫీజులను స్టాంప్స్​ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేసింది. కానీ నేటికీ ఆ నిధులను మాత్రం జీహెచ్ఎంసీకి ఇవ్వడం లేదు. కనీసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రాష్ట్ర సర్కారు ఖాతాలోకి వచ్చిన నిధుల వివరాలను కూడా బల్దియాకు చెప్పడం లేదు. దీంతో బల్దియాకు రోజురోజుకు మరింత అప్పుల్లోకి వెళ్తోంది. టౌన్​ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచే బల్దియాకు ఎక్కువ ఆదాయం వస్తుంది.  కానీ ఈ నిధులను ప్రభుత్వమే తీసుకుంటుండటంతో బల్దియాపై భారం పడుతోంది.  జీహెచ్ఎంసీకి రావాల్సిన స్టాంపు డ్యూటీ, మ్యుటేషన్ ఫీజుల నిధులను ఇవ్వాలంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్​ శాఖకు అధికారులు కొన్ని నెలల కిందట లెటర్ రాశారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో ఎప్పుడో జమ చేశామంటూ ఆ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి సమాధానం వచ్చింది. ఇదే అంశంపై బల్దియా అధికారులు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్​తో మాట్లాడగా.. తొందరలోనే చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం.  

రూ.1,200 కోట్లు రావాలె..

2020–21, 2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించిన స్టాంపు డ్యూటీ, మ్యుటేషన్ ఫీజులు దాదాపుగా రూ.1,200 కోట్లు ఉంటాయని బల్దియా అధికారులు చెబుతున్నారు. 4 రోజుల కిందట జరిగిన కౌన్సిల్​ మీటింగ్​లోనూ కమిషనర్ లోకేశ్​ కుమార్ ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ఈ నిధులను ఎందుకు ఇవ్వడం లేదనే దానిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు.  జీహెచ్ఎంసీకి సంబంధించి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగానే వ్యవహరిస్తోంది. ఏ నిధులను ఇవ్వకపోవడం వల్లే బల్దియా అప్పుల్లోకి వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి.