కొత్త రేషన్​ కార్డులు ఎప్పుడు.. 48,215 ఫ్యామిలీస్ ఎదురుచూపులు

నిజామాబాద్,  వెలుగు: రాష్ట్రప్రభుత్వం ఆరేండ్లుగా కొత్త రేషన్​కార్డులు మంజూరు చేయడం లేదు. ఏటా కుటుంబాల సంఖ్య  పెరుగుతున్నా ఆ మేరకు రేషన్​కార్డులు మాత్రం పెరగడం లేదు. మీ సేవా ద్వారా అప్లికేషన్లు తీసుకోవడమే తప్ప కొత్త కార్డులు ఇవ్వకపోవడంతో ఆయా కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసే పలు స్కీములకు దూరమవుతున్నారు. ఇటీవల బీసీలకు లక్ష ఆర్థిక సాయం స్కీముకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులని సర్కారు ప్రకటించడంతో  నిజామాబాద్​ జిల్లాలో కార్డులు లేక వేలాది మంది నష్టపోయారు.

2016 జనవరిలో చివరిసారి

రాష్ట్ర వ్యాప్తంగా 2016 జనవరిలో రేషన్​ కార్డులు ఇచ్చిన గవర్నమెంట్​మధ్యలో ఒక్కసారి నియోజకవర్గానికి వంద చొప్పున కొత్త కార్డులు మంజూరు చేసింది. ​పెళ్లి తరువాత ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన  కొత్త కుటుంబాల సంఖ్య పెరుగుతోంది.  ఈ రకంగా వేరుపడిన 1,36,064  వ్యక్తుల తరపున 48,215 ఫ్యామిలీస్​ తమకు కొత్త కార్డులు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు.   ఎంక్వయిరీ తరువాత 10,730 దరఖాస్తులను రిజెక్టు జాబితాలో పెట్టి 37, 485 కుటుంబాలకు కార్డులు పొందే అర్హత ఉందని రెవెన్యూ ఆఫీసర్లు తేల్చారు. 

కొత్తగా13,544 అర్జీలు

జిల్లాలో ప్రస్తుతం 4.15 లక్షల రేషన్​ కార్డులున్నాయి.  వివాహం తరువాత పుట్టిన పిల్లలు ఏడాది వయస్సు దాటితే చౌక బియ్యానికి అర్హత లభిస్తుంది.  పెళ్లి తరువాత  యువతి  పేరు తండ్రి కార్డు నుంచి భర్త కార్డులో చేరాలి.  ఇలాంటి చేర్పుల కోసం48,633 వ్యక్తుల తరపున 13,544 అప్లికేషన్లు పౌరసరఫరాల శాఖకు వెళ్లాయి.  వాటిలో 8,111 దరఖాస్తులకు పూర్తి ఎలిజిబిలిటీ ఉందని విచారణ ఆఫీసర్లు నిర్దారించారు.  355 రిజెక్టు కాగా  5,078 ఆర్జీల ఎంక్వయిరీ పూర్తి  కావాల్సి ఉంది.కొత్త కుటుంబాల్లో 2016 తరువాత జన్మించిన వారి వివరాలను నమోదు చేసే అవకాశం లేకపోవడంతో బియ్యానికి దూరమవుతున్నారు.

నాలుగేళ్ల సంది సూసుడే

చాలీచాలని పేద కుటుంబం మాది.  నేను, నా భర్త ఇద్దరి పేర్లతో ఉన్న కార్డులో మా ఇద్దరు పిల్లల పేర్లు చేర్చమని మీ-సేవలో అప్లికేషన్​ పెట్టిన. నాలుగేండ్ల సంది ఎదురు చూసుడే కానీ వారి పేర్లు చేరుస్తలేరు.  దరఖాస్తులు తీసుకున్న వెంటనే నిర్ణయాలు తీసుకుంటే పేదలకు మేలు జరుగుతుంది. 

భాగ్యలక్ష్మీ

సంక్షేమ పథకాలకు ముఖ్యం

రూపాయి కిలో బియ్యమే పొందడమే కాకుండా ఆయా సబ్సిడీ స్కీంల మంజూరుకు రేషన్​కార్డు ప్రమాణికం.  పిల్లల స్కాలర్​షిప్​, ఫ్యామిలీ ఇన్​కమ్​ సర్టిఫికేట్, డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్ల శాంక్షన్​కు ఆధార్​కార్డుతో పాటు రేషన్​ కార్డును పరిగణలోకి తీసుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన సబ్సిడీ లోన్​ల మంజూరుకు ఆ కుటుంబాల రేషన్​ కార్డునే ఆఫీసర్లు కన్సిడర్ చేస్తారు. ఇంతటి ప్రయారిటీ ఉన్నా కొత్త కార్డుల మంజూరు లేక పూర్​ ఫ్యామిలీస్​ ఆందోళన చెందుతున్నాయి.