ఐరిస్​​తో అక్రమాలకు చెక్​

 ఐరిస్​​తో అక్రమాలకు చెక్​
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఐరిస్​ సేకరంచనున్న సిబ్బంది
  • జిల్లాకు చేరుకున్న పరికరాలు
  • అర్హులైన రైతులే ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం

మహబూబాబాద్, వెలుగు: అన్నదాతల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్​చెల్లించనుంది. కాగా, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను నిరోధించడానికి కొత్త విధానాలను అమలు చేయనుంది. ఇందులో భాగంగానే  ఐరిస్​ విధానం ప్రవేశపెట్టనుంది. ఐరిస్​కు ఆధార్​ అనుసంధానం చేయడం ద్వారా దళారుల అక్రమాలకు చెక్​ పెట్టవచ్చు. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు ఐరిస్​ పరికరాలు చేరుకున్నాయి. ఈ టెక్నాలజీతో అర్హులైన రైతులే ధాన్యాన్ని అమ్మునేందుకు అవకాశం కలుగనుంది. 

ఐరిస్​ అమలుతో పారదర్శకత..

గతంలో ధాన్యం కొనుగోలు నిర్వహణ క్రమంలో కొంతమంది మధ్య దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల నిర్వహకుల సహకారంతో నేరుగా రైస్ మిల్లులకు తరలించేవారు. బినామీ రైతుల పాసుబుక్ ఆధారంగా సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలను నిరోధించడానికి ఐరిస్​ ద్వారా చెక్​పడనుంది. రైతుల ఐరిస్​ వివరాలు సేకరించి, ఆధార్ కార్డుల అనుసంధానం ద్వారా ధాన్యం కొనుగోలులో మరింత పారదర్శకత ఏర్పడనుంది.

రైతులకు అందుబాటులో కేంద్రాలు

అధికారులు అన్నదాతలకు అందుబాటులోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాబాద్ 234, వరంగల్ 203, భూపాలపల్లి 189, జనగామ 180, ములుగు 173, హనుమకొండ 149 కేంద్రాలను ఈ వానాకాలం వడ్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, సీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,300 చెల్లించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు 9,02,233 ఎకరాల్లో వరి సాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సన్న రకం ధాన్యానికి రూ.500  బోనస్ ప్రకటించడంతో వానాకాలం సీజన్ లో సన్న రకం సాగు పెరిగింది. 

ఏఈవోల పాత్ర కీలకం 

ధాన్యంలో తేమశాతం నిబంధనల ప్రకారం నిర్ధారణ చేసి టోకెన్లు జారీ చేయడంలో ఏఈవోలు కీలకపాత్ర పోషించనున్నారు. 33 రకాల సన్న రకం ధాన్యం గుర్తింపులో తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. సన్నధాన్యం నిర్ధారణకు డయల్ మైక్రో మీటర్ ను వినియోగించనున్నారు. ఈ యంత్రం మూలంగా గింజ పొడవు, వెడల్పును నిర్ధారించనున్నారు. ప్రతి గ్రామంలో సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సన్న వడ్లకు ఎరుపు రంగు గన్ని బ్యాగులు, దొడ్డు రకానికి ఆకుపచ్చ దారంతో కూడిన బస్తాలను వినియోగించనున్నారు.

పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందాల్సి ఉంది 

వానాకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐరిస్​ పరికరాలు జిల్లాకు చేరుకున్నాయి. వానాకాలం సీజన్ లోనే పూర్తిస్థాయిలో  ఐరిస్​​వినియోగించేలా మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేయనున్నాం. రైతులంతా కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి.- కృష్ణవేణి, సివిల్ సప్లై డీఎం, మహబూబాబాద్