ఆదివాసీ సొసైటీలతోనే ఇసుక వ్యాపారం

ఆదివాసీ సొసైటీలతోనే ఇసుక వ్యాపారం
  • ఇసుక పాలసీలో సంస్కరణలకు కాంగ్రెస్​ సర్కారు కొత్త ప్రణాళిక 
  • పైలట్ ప్రాజెక్టులుగా నందులచెలక, రేగుబల్లి ర్యాంపులు

భద్రాచలం, వెలుగు :  ఆదివాసీ సొసైటీలతోనే ఇసుక వ్యాపారం చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది.  వారినే వ్యాపారులుగా, కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్ది వారికే లాభాలు అందించేలా కొత్త ప్రణాళికలను రచిస్తోంది. బినామీ కాంట్రాక్టర్ల అక్రమాలకు చెక్​ పెట్టి వారి కబంధ హస్తాల నుంచి తప్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రౌండ్​ లెవల్​లో సర్వేకు ట్రైకార్, టీజీఎండీసీ, ట్రైబల్ వెల్ఫేర్​ ఆఫీసర్లను రంగంలోకి దించింది.

గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పటికే ములుగు జిల్లాలో ఆదివాసీ సొసైటీలతో వీరు భేటీ అయి వివరాలు సేకరించారు. తాజాగా ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆదేశాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన దుమ్ముగూడెం మండలం నందులచెలక, రేగుబల్లిల్లో వీరు సొసైటీ మహిళా సంఘాల సభ్యురాళ్లతో టీజీఎండీసీ జీఎం ఎల్లయ్య, ట్రైబల్​ వెల్ఫేర్​ అడిషనల్ డైరక్టర్​ సర్వేశ్వరరెడ్డి, ట్రైకార్​ జీఎం శంకర్​రావు సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. 

సొసైటీ సభ్యుల్లో నిర్వహణ సామర్థ్యం పెంచేలా.. 

ఆదివాసీ సొసైటీ సభ్యుల్లో ఇసుక ర్యాంపుల నిర్వహణ సామర్థ్యం పెంచేలా అధికారులు పక్కాగా ప్లాన్​ చేస్తున్నారు. ట్రైకార్​ ద్వారా సొసైటీలకు ఐటీడీఏల పర్యవేక్షణలో ఇసుకను తోడేందుకు అవసరమయ్యే మిషనరీ, లారీలను స్వయంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి కొనుగోలు చేసే అంశాలపై పరిశీలిస్తున్నారు. వారికి ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్​, సొసైటీ చట్టాలు, నిబంధనలు, అకౌంట్స్, బిజినెస్ ఎలా చేయాలి, తదితర అంశాలతోపాటు మైనింగ్​ నిబంధనలను తెలియపరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీటిపైనే సర్కారు నియమించిన టీమ్​ ఇటీవల నందులచెలక, రేగుబల్లి ర్యాంపుల్లో సొసైటీ మహిళలతో మాట్లాడి వివరాలు సేకరించింది. సొంతంగా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సాహం ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని వారికి వివరించింది. 

ఆదివాసీ సొసైటీలతో సాధ్యమే!

ఆదివాసీ సొసైటీలతో ఇసుక వ్యాపారం చేయించడం, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడం సాధ్యమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ హయాంలోనే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం, వెంకటాపురం మండలం మొర్రవానిగూడెం ఇసుక ర్యాంపుల్లో నాడు ఈ ప్రయోగం చేసి సక్సెస్​ సాధించారు. తవ్వడం, లోడింగ్, అమ్మడం ఇలా అన్నీ సొసైటీలే చూసుకుని లాభాలు గడించాయి. దీనితో ఈ రెండు ర్యాంపుల్లోని సొసైటీ మహిళా సభ్యులకు అవార్డులు ఇచ్చి, సత్కరించారు. 

ముస్సోరీలోని ఐఏఎస్​ల ట్రైనింగ్​ సెంటర్​కు వీరిని తీసుకెళ్లి ఆదివాసీ ఇసుక సొసైటీలు ఎలా సక్సెస్​ అయ్యాయో కూడా వివరించారు. అంతటి చరిత్ర ఉంది.. కానీ, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని బీఆర్ఎస్​ సర్కారు చేసిన నిర్వాకం, బినామీ కాంట్రాక్టర్లు, తదితర చర్యలు ఆదివాసీల కొంప ముంచాయి. దీనితో పదేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క లోపాలను సమీక్ష చేసి ఆదివాసీ సొసైటీల ద్వారానే ఇసుక వ్యాపారం చేసేలా చర్యలకు ఆదేశించారు.