భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.60 కోట్లు

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.60 కోట్లు
  • నిధులు కేటాయిస్తూ తెలంగాణ సర్కారు జీవో

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామాలయం అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించేందుకు రూ.60.20 కోట్ల నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్246 జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ, భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో ప్రకటించిన మేరకు భద్రాద్రి గుడి అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు స్పెషల్ ఫండ్స్  కేటాయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాస్టర్​ ప్లాన్​ తయారీకి పలు దఫాలుగా ఉన్నతాధికారులను భద్రాచలం పంపించారు.

ఆర్కిటెక్ట్  వచ్చి దేవస్థానం అభివృద్దికి చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళికను రూపొందించారు. అందుకు ఆలయం చుట్టూ ఉన్న కొంత భూమి అవసరం ఉంటుందని నిర్ధారించారు. దాదాపు 43 ఇండ్లను భూసేకరణ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయ ప్రాకారాలు నిర్మించేందుకు ఎకరందాకా భూమి కావాల్సి ఉంది.

ఇండ్లను తీసుకునేందుకు దశలవారీగా యజమానులతో ఎండోమెంట్ కమిషనర్​, దేవస్థానం ఈవో, అడిషనల్ కలెక్టర్​, ఆర్డీవోలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో యజమానులు పలు డిమాండ్లు పెట్టారు. దీంతో భూ సేకరణకు అవసరమైన నిధులు రూ.60.20కోట్లను కేటాయిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియా జీవో రిలీజ్​ చేశారు.