సాగు చేయని భూములకు డబ్బులిస్తున్న రాష్ట్ర సర్కార్

పెద్దపల్లి, వెలుగు: రైతుల పంట సాగుకోసం పెట్టుబడి రూపంలో ఇస్తున్న రైతుబంధు పైసలు వృథా అవుతున్నాయి. చాలాచోట్ల సాగులో లేని భూములు, ఇటుక బట్టీలు పెట్టిన భూములు, వెంచర్లుగా మారిన భూములకు కూడా రైతుబంధు పైసలు పడుతున్నయి. ఎలాంటి నాలా కన్వర్షన్​ లేకుండా వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు, వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంటసాగు విస్తీర్ణం వివరాలు సేకరించాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, ఇటుక బట్టీల ఏర్పాటుపై  మైనింగ్ అధికారుల అబ్జర్వేషన్ లేకపోవడం, ధరణిలో ఉన్న భూములన్నీ సాగులో ఉన్నాయో లేదో రెవెన్యూ అధికారులు గుర్తించకపోవడంతో వేల ఎకరాల్లో అనర్హులకు రైతుబంధు పైసలు ఇస్తున్నారు. 

ఇటుక బట్టీలతో డబుల్ ఇన్​కం..

 వ్యవసాయ భూములను ఇటుక బట్టీలకు ఇస్తున్ భూ యజమానులు ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేలు ఏడాదికి తీసుకుంటున్నారు. పంట పండిస్తే వచ్చే డబ్బులకు రెట్టింపు ఇచ్చి ఇటుక బట్టీ యజమానులు భూములను లీజుకు తీసుకుంటున్నారు. పంట పండించకపోయినా రైతుబంధు వస్తుండడంతో భూ యజమానులు రెండురకాలుగా లాభపడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం, సుల్తానాబాద్, కాల్వ శ్రీ రాంపూర్, రామగిరి మండలాల్లో వేల ఎకరాల్లో ఇటిక బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూమిలో ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా నాలా పర్మిషన్ తీసుకోవాలి. సర్టిఫికెట్​వచ్చాకే ఇండస్ట్రీ ప్రారంభించాలి. కానీ ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే ఇటుక బట్టీలు పెట్టుకున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 

వెంచర్లుగా అగ్రీ ల్యాండ్స్..

పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల ధరలు పెరగడంతో రైతులు వాటిని ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. రియల్టర్లు రైతులకు రెండింతల డబ్బులు ఇచ్చి భూములు చేజిక్కించుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి భూముల వివరాలు ధరణిలో అలాగే ఉండడంతో సదరు భూ యజమానికి రైతుబంధు డబ్బులు యథావిధిగా వస్తున్నాయి. వెంచర్లు వెలుస్తున్నా  వాటికి ఎలాంటి నాలా కన్వర్షన్ లేకున్నా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్​చేస్తున్నారు. ఇటుక బట్టీ భూములన్నీ లీజుకు తీసుకున్నవి కావడంతో, ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేవిధంగా నాలా కన్వర్షన్​ కోసం చలాన్ కట్టి వాటిని సంబంధిత అధికారులకు ఇస్తున్నారు. ఎవరైనా అడిగితే నాలా కన్వర్షన్​ కోసం అప్లయ్​ చేసుకున్నారని, సర్టిఫికెట్ రాగానే రైతుబంధు లిస్ట్​ నుంచి తొలగించేలా చూస్తాం అని అధికారులు చెబుతుండడం గమనార్హం.