స్థానిక ఎన్నికలకు 45 రోజుల డెడ్​లైన్​ .. అధికారులకు సంకేతాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

స్థానిక ఎన్నికలకు  45 రోజుల డెడ్​లైన్​ .. అధికారులకు సంకేతాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఆలోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై క్లారిటీ
  • బిల్లులను తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెలపాటు కేంద్రంతో  పోరాటం 
  • కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై రెండు ప్రతిపాదనలు ఒకటి: నేరుగా అమలు చేయడం.. 
  • రెండు: కోర్టు బ్రేకులు వేస్తే పార్టీపరంగా 42%  సీట్లు
  • జూన్​లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్​ నిర్వహించేలా ఏర్పాట్లు
  • ఇప్పటికే ఎన్నికల​ ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్

హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో పెండింగ్​పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్​లైన్​ పెట్టుకున్నది. ఏప్రిల్​1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్​ అయ్యింది.  స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసన సభ, మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కారు.. వాటిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నది.

ఇందుకోసం కలిసివచ్చే పార్టీలు, బీసీ, ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదికగా రాబోయే నెల రోజులు అలుపెరగని పోరాటం చేసేందుకు ఆలోచన చేస్తున్నది.  కేంద్రం నుంచి గ్రీన్​సిగ్నల్​వస్తే ఓకే.. లేదంటే నేరుగా అమలుచేయాలని, ఒకవేళ ఆ ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీపరంగా బీసీలకు 42 శాతానికి పైగా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తున్నది.  ఇదే విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు  తెలిసింది. ఏది ఏమైనా వచ్చే జూన్​లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, ఇందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

వచ్చే నెలంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్​.. 

బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్​లో చేర్పించడమే లక్ష్యంగా రాబోయే ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం తమిళనాడులాంటి రాష్ట్రాల సహకారం తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. త్వరలోనే  రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలిసివచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి.. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించాలని.. షెడ్యూల్​ 9లో చేర్చాలని కోరనున్నారు.  

అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై సర్కారు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే సమగ్ర కుల గణన సర్వే.  బీసీ కమిషన్​ స్టడీ రిపోర్ట్​లన్నీ సిద్ధంగా పెట్టుకున్నది.  బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా ఆమోదం పొందాయి.  ప్రస్తుతం ఈ రెండు బిల్లులు  రాజ్​ భవన్​కు చేరినట్టు తెలిసింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అంశం కేంద్రం పరిధిలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వంతోనే అమీతుమీకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. 

 ఫండ్స్​రాక.. పల్లెల్లో నిలిచిన పనులు

గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు నిరుడు ఫిబ్రవరిలో  గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో  కేంద్రం నుంచి వచ్చే 15వ  ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. సెంట్రల్​ నుంచి మొత్తం రూ.1,500  కోట్లకు పైగా పెండింగ్ లో​పడ్డాయి. ఎన్నికలు ముగిసి పాలక వర్గాలు కొలువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఇక మండల పరిషత్​, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు నిరుడు జూలై మొదటివారంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలకు గత నెల 26 న గడువు ముగియగా, అన్నిచోట్లా ఇన్​చార్జీల పాలన కొనసాగుతున్నది. ఒక్కో అధికారికి ఐదారు పంచాయతీలు, మండల పరిషత్​లు, మున్సిపాలిటీలు ఉండడంతో వారానికోసారి కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.  

ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కాంగ్రెస్​ నేతల నుంచి ఎన్నికల కోసం ఒత్తిడి పెరిగిపోతున్నది.  కాంగ్రెస్​ పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లో పార్టీ కేడర్​​కూడా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్నది. కేడర్​కు  సర్పంచ్,  ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలాంటి పదవులు దక్కితే పార్టీ కూడా పటిష్టం అవుతుందనే భావనలో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో పార్టీకి, కేడర్​కు గ్యాప్​ పెరుగుతుందని ప్రభుత్వానికి  ఇంటెలిజెన్స్ రిపోర్ట్  అందింది.  వీటన్నింటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్​లో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది.  

 సర్కారు ముందు 2 ఆప్షన్స్​

కేంద్రం బీసీ రిజర్వేష్ల పెంపును ఎటూ తేల్చకపోతే.. 2 రకాల ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఒకటి నేరుగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి.. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లడం.  దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ మేరకు లీగల్​గా కూడా ఫైట్​ చేయడానికి  రాష్ట్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నది. సమగ్ర కుల గణన సర్వే,  బీసీ కమిషన్​ స్టడీ రిపోర్ట్స్​తో ఫైట్​చేయాలని భావిస్తున్నది. 

ఒకవేళ కోర్టుల నుంచి ఏదైనా స్టే వచ్చినా.. రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా.. సుప్రీం కోర్టులో  కొట్లాడాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్నికలను మరింత ఆలస్యం చేయకుండా పార్టీపరంగా  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నది. ఇదే అంశంపై ఉన్నతాధికారులకు సీఎం క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.