బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర సర్కారు రాజకీయం

బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర సర్కారు రాజకీయం

బొగ్గు బ్లాకుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ద్వంద్వ నీతి పాటిస్తూ  సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందనే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. సింగరేణిలో 51శాతం వాటా ఉన్న రాష్ట్ర సర్కారును కాదని 49 శాతం వాటా ఉన్న కేంద్ర సర్కారు ప్రైవేటీకరణపై ఎలా నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాదు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్​మెంట్, రెగ్యులేషన్(ఎంఎండీఆర్) అమెండ్​మెంట్ యాక్ట్ 2015 ప్రకారం వేలం ప్రక్రియ ద్వారా దేశంలో బొగ్గు గనుల కేటాయింపు జరుగుతోంది.  దీని ప్రకారం రాష్ట్ర సర్కారు.. సింగరేణి ద్వారా వేలం పాటలో ఒడిశాలోని నైనీ బ్లాక్, న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకులను దక్కించుకుంది. ఇదే పద్ధతిలో తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేస్తే మాత్రం సింగరేణి బిడ్స్​ వేయకుండా అడ్డుకుంటున్నది. ఈ వేలం పాటను సాకుగా చూపుతూ సింగరేణిని కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందంటూ ప్రచారం 
ప్రారంభించింది.  బీఆర్ఎస్​ తన అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్​ను ముందరపెట్టి కృత్రిమ ఆందోళనలు చేస్తూ కార్మికులను తప్పుదోవపట్టిస్తున్నది. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్వయానా ప్రధాని రామగుండం పర్యటనలో తేల్చిచెప్పారు. నాలుగు బ్లాకుల వేలం పాటలో పాల్గొనేందుకు బయట కంపెనీలు పెద్దగా ఇంట్రెస్ట్​ చూపడం లేదు. ఇలాంటి టైంలో సింగరేణికే బ్లాకులు దక్కే ఛాన్స్ ఉంది. 

కానీ  సింగరేణి యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా సర్కారు పెద్దలు ఆడుతున్న పొలిటికల్​ గేమ్​లో పావుగా మారింది. తాజాగా సింగరేణిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బ్లాకులు దక్కించుకోవడానికి బయటి కంపెనీలు వేలంలో పాల్గొనకపోతే టెక్నికల్​గా ఒకటి, రెండు సార్లు చూసి బిడ్ వేసిన ఒకే కంపెనీకి కూడా బ్లాక్​ కేటాయించే చాన్స్​ ఉంది. ఇప్పటికే కొయ్యగూడెం3 బ్లాక్ ను ఒకే బిడ్ ద్వారా అరబిందో కంపెనీ దక్కించుకుంది. ఇది సర్కార్ పెద్దల బినామీ కంపెనీ. సింగరేణిలో గొడవలు రేపి మిగిలిన బ్లాకులను కూడా అస్మదీయులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఓవైపు బొగ్గు బ్లాకులను బినామీ కంపెనీల ద్వారా దక్కించుకుంటున్న పెద్దలు, ఆ విషయం బయటపడకుండా ప్రైవేటీకరణ కుట్ర తెరపైకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ద్వారా త్వరలో జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం, సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న సంగతిని కార్మికులు అర్థం చేసుకుంటున్నారు. 

 అప్పుడు మద్దతు.. ఇప్పుడు రాజకీయం

యూపీఏ హయంలో ఇష్టానుసారం బొగ్గు గనుల కేటాయింపుతో రూ.లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో216 గనుల కేటాయింపులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతోనే  మోడీ సర్కార్ 2015లో గనుల చట్టాన్ని సవరించింది. పార్లమెంట్​లో కొత్తగా ఎంఎండీఆర్ చట్టాన్ని తీసుకువస్తే దానికి అప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కొత్త చట్టం ప్రకారమే దేశంలో బొగ్గు బ్లాకులన్నింటినీ బహిరంగ వేలం ద్వారా  కేటాయిస్తున్నా, కేంద్రాన్ని తప్పుపట్టడం ఏమిటో అర్థం కాదు. చట్ట సవరణ ద్వారా బొగ్గు గనులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు క్యాప్టివ్​మైన్స్, రిజర్వేషన్స్, వేలం అనే మూడు పారదర్శక విధానాలు పొందుపర్చారు. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆనాడు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికారు. భవిష్యత్ లో సింగరేణి కూడా వేలం ద్వారానే బొగ్గు బ్లాకులు పొందాల్సి ఉంటుందన్న సంగతి అప్పుడే తెలిసినా గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. తీరా ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం తాము మద్దతిచ్చిన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ  సింగరేణి కార్మికులను మోసం చేయడం తప్ప మరోటి కాదు. గతంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని అనేకసార్లు కలిశారు. అప్పటికే ఈ చట్టం ఉన్నప్పటికీ సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపు, సింగరేణి కార్మికుల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు?  

 ఇతర రాష్ట్రాలకు లేని సమస్య ఇక్కడే ఎందుకు?

ఎంఎండీఆర్ చట్టం అమల్లోకి వచ్చాక 288 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ సందర్భంగా కోలిండియా యాజమాన్యం, గుజరాత్, రాజస్థాన్, జార్ఘండ్, చత్తీస్ గఢ్​ రాష్ట్రాల సీఎంలు చొరవతీసుకొని  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపి, బొగ్గు గనుల రిజర్వేషన్స్ విధానంలో116  బొగ్గు గనులు పొందారు. తెలంగాణలోని సింగరేణి ప్రాంత బ్లాకులను  పొందేందుకు రాష్ట్ర  సర్కారు ఎప్పుడూ సంబంధిత మంత్రిత్వశాఖను సంప్రదించలేదు. 2021 అక్టోబర్లో దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులకు బహిరంగ వేలానికి ప్రకటన చేసింది. అందులో ఉన్న సింగరేణికి చెందిన కల్యాణి ఖని– 6, శ్రావణపల్లి, కొయ్యగూడెం–3, సత్తుపల్లి–3 బొగ్గు బ్లాక్​లను దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి నాలుగు బిడ్ ఫామ్​లను రూ.20 లక్షలతో కొన్నది. తర్వాత సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ వేలంలో షెడ్యూల్ దాఖలు చేయలేదు. వేలంలో పాల్గొంటే రాయల్టీ వస్తుంది. పన్నులు తగ్గుతాయి.

 మన బ్లాకులు మనకు రావడంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఒడిశాలో రెండు బొగ్గు బ్లాకులకు ఇతర కంపెనీలు పోటీపడిన అనుభవం దృష్ట్యా కేంద్రం సింగరేణికే కేటాయించింది. బొగ్గు బ్లాకుల వేలంపై కార్మిక సంఘాలు వ్యతిరేకంగా ఉండటం, టెండర్​వేసే సాహసం ఎవరూ చేయరని, గనులను ప్రైవేటు పరం కానివ్వమని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తాడిచెర్ల బొగ్గు గనిని టీఎస్​జెన్​కోకు కేటాయిస్తే తవ్వకాలను సింగరేణికి ఇవ్వాల్సిన రాష్ట్ర సర్కారు.. ఏఎంఆర్ కంపెనీకి 25 ఏండ్ల పాటు లీజ్​కు ఇచ్చింది. ఈ కంపెనీ రాష్ట్ర సర్కార్ పెద్దల బినామీ కంపెనీ అనే అనుమానాలున్నాయి. ఇలా సింగరేణికి దక్కాల్సిన తాడిచర్ల బ్లాక్​ను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన రాష్ట్ర సర్కారు, చట్ట ప్రకారం సాగుతున్న గనుల కేటాయింపుపై రాద్ధాంతం చేయడం తనకుమాలిన నీతే తప్ప మరోటి కాదు.

ఒడిశాలో ఓకే.. ఇక్కడ వద్దు..

ఒడిశాలో బొగ్గు గనుల కోసం వేలంలో పాల్గొనే సింగరేణి, తెలంగాణలోని బొగ్గు గనుల వేలంలో ఎందుకు పాల్గొనదు?13వ విడత వేలంలో ఒడిశాలోని బొగ్గు గనుల కోసం సింగరేణి బిడ్స్ వేసి, నైని, న్యూపాత్రపాద గనులను దక్కించుకుంది. మరి వేలం ద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమైనప్పుడు సింగరేణి యాజమాన్యం ఒడిశాలో  బొగ్గు ఎలా తవ్వుతుంది? సింగరేణి గనుల్లో ఎన్ని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో, అందులో 50 శాతం ఈ రెండు మైన్లలోనే ఉన్నాయి. ఆ స్థాయి గనులను కేంద్రం సింగరేణికి కేటాయించడం అంటే సింగరేణి సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లే కదా! ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల కోసం బిడ్​లో పాల్గొంటున్న సింగరేణి, తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం పక్కా రాజకీయమే. ఇది సంస్థను, కార్మికులను, సింగరేణి ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప మరోటి కాదు. 

యాదగిరి సత్తయ్య