యూనిక్ నంబర్తో స్మార్ట్ రేషన్ కార్డులు

యూనిక్ నంబర్తో స్మార్ట్ రేషన్ కార్డులు
  • రేషన్ కార్డు..ఇక స్మార్ట్!
  • ప్రత్యేక చిప్‌‌‌‌తో ఏటీఎం కార్డు తరహాలో తయారీ 
  • ఫొటోల్లేకుండా కేవలం యూనిక్ నెంబర్‌‌‌‌‌‌‌‌తో కార్డు
  • స్వైప్ చేస్తే లబ్ధిదారుల వివరాలు 
  • మార్చి మొదటి వారంలో పంపిణీ ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిని ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్, యూనిక్ నెంబర్‌‌‌‌‌‌‌‌తో అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్డులను ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

కార్డు నమూనా అప్రూవల్​కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్​పంపారు. సీఎం నుంచి గ్రీన్​సిగ్నల్​రాగానే కార్డుల ప్రింటింగ్​ ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే ప్రింటింగ్‌‌‌‌కు సంబంధించిన షార్ట్​టెండర్​పనులు జరుగుతున్నాయి. 

రోజుకు ఎన్ని స్మార్ట్​కార్డులు ప్రింట్​చేస్తారనే దానిపై ప్రింటర్లతో చర్చలు జరుగుతున్నాయని సివిల్​సప్లయ్స్​కమిషనర్ డీఎస్ చౌహాన్​తెలిపారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం విడతల వారీగా లబ్ధిదారులందరికీ అందించనున్నారు. 

స్మార్ట్ కార్డులో ఏముంటయ్?  

రాష్ట్రంలో90 లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి.. అందరికీ స్మార్ట్​రేషన్​కార్డులు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దానికి ప్రత్యేకమైన గడువంటూ ఏమీ లేదని సివిల్​సప్లయ్స్​అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్డుపై ఎవరి ఫొటోలు ఉండవని, కేవలం యూనిక్​నెంబర్‌‌‌‌‌‌‌‌తోనే స్మార్ట్​రేషన్ కార్డు ఉంటుందని చెబుతున్నారు. 

ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్‌‌‌‌తో ఉండే ఈ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల పేర్లు, ఆధార్​నెంబర్లు, అడ్రస్, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందిస్తున్నట్టు సివిల్ సప్లయ్స్​కమిషనర్​డీఎస్​చౌహాన్​తెలిపారు. యూనిక్​నెంబర్ ఎంటర్ చేసినా, కార్డును స్వైప్ చేసినా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్‌‌‌‌లో వివరాలు వచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్​కార్డుతో ఎక్కడైనా రేషన్​ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.  

కొత్త అప్లికేషన్లు 1.50 లక్షలు.. 

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా ద్వారా ఇప్పటివరకు 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు సివిల్​సప్లయ్స్​అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే లక్ష వరకు అప్లికేషన్లు వచ్చాయని, మరో లక్ష వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కులగణన సర్వే, మీ సేవా కేంద్రాలతో పాటు గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి దాదాపు 10లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తున్నది.

 దీనికి తోడు కుటుంబసభ్యుల మార్పుచేర్పుల కోసం 20 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌‌‌తో పాటు గ్రామ సభల ఆమోదం వంటి ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, దశలవారీగా స్మార్ట్​రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.