హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) సౌత్ పార్ట్ కూడా కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర ప్రభుత్వమే టెండర్లు పిలిచింది. ఈ రూట్ లో 95 శాతం భూసేకరణ పూర్తి అయింది. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ సంగారెడ్డి నుంచి ఆమన్‌గల్–షాద్‌నగర్–చౌటుప్పల్ వరకు 189.20 కి.మీ నిర్మించనున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఫ్యూచర్ సిటీలను కనెక్ట్ చేసేలా ఈ రూట్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకు భూసేకరణ, ప్రాజెక్ట్ నిర్మాణం కలిపి దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఫండ్స్ కోసం జైకా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవాలనుకుంది. అయితే సౌత్ పార్ట్‌ను కూడా కేంద్రమే నిర్మించాలని కోరుతూ తాజాగా లేఖ రాసినట్లు సమాచారం.