- 19 జిల్లాల్లో వంద శాతం కంప్లీట్
హైదరాబాద్, వెలుగు: సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాలలో 99 శాతానికిపైగా పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే19 జిల్లాల్లో సర్వే వంద శాతం పూర్తయిందని ఒక ప్రకటనలో తెలిపింది. నమోదు చేసిన వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా అంతే వేగంగా కొనసాగుతోందని పేర్కొంది. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 49,79,473 ఇండ్లకు సంబంధించిన కంప్యూటరీకరణ పూర్తయింది.
అత్యధికంగా 92.0 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలువగా.. 86.0 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో ఉంది. సిద్దిపేటలో 80.4 శాతం కంప్యూటరీకరణ పూర్తవగా మహబూబ్ నగర్ లో 73.9 శాతం పూర్తయింది. రెండు జిల్లాల్లో 70 శాతానికిపైగా, నాలుగు జిల్లాల్లో 60 శాతానికి పైగా, 11 జిల్లాల్లో 50 శాతానికి పైగా కంప్యూటరీకరణ పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 82.4 శాతం సర్వే ప్రక్రియ పూర్తవగా ఇంకా 4,41,225 ఇండ్ల సమాచారాన్ని సేకరించాల్సి ఉంది.