- 11 నెలల్లో భర్తీ చేసిన కొలువులు 53 వేలకుపైనే
- టాప్లో విద్యాశాఖ.. ఆ తర్వాత పోలీస్ శాఖ
- వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
- త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు
- డిసెంబర్లో 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: 11 నెలల్లో 53 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో విద్యా శాఖ టాప్లో ఉందని వెల్లడిం చింది. గురుకులాల్లో, స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు 18,310 భర్తీ చేశామని వివరించింది. విద్యా శాఖ తర్వాతి స్థానంలో పోలీసు శాఖ ఉన్నది. కానిస్టేబుల్స్, ఎస్ఐ ఇతరత్రా అన్ని పోస్టులు కలిపితే పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 7,094 మంది స్టాఫ్ నర్స్ ల నియామకాలు పూర్తి చేసినట్లు వివరించింది. ఇందులో 6,956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
మొత్తం 5,378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి.. వాయిదా పడ్డవి.. పెండింగ్లో పెట్టిన ఫలితాలన్నింటినీ ఈ 11 నెలల కాలంలోనే రిలీజ్ చేశామని వివరించింది.బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఒక్కసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే... కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ –2024 నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను ప్రకటించామని తెలిపింది. వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం 8,304 మందికి నియామక పత్రాలను అందించింది.
గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి.. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చామని.. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని ప్రభుత్వం వివరించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని ప్రభుత్వం పేర్కొంది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారని గుర్తు చేసింది.
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 తుది ఫలితాలను కూడా టీజీపీఎస్సీ వెల్లడించిందని తెలిపింది. ఇందులో ఎంపికైన 8,143 మంది అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి ఏడాది విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుంది.
11 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇట్ల
రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేసిన పోస్టులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 3,393
మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 6,956
తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 16,067
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్
ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 8,304
డీఎస్సీ- పాఠశాల విద్య 10,006
ఇతర సంస్థలు 441
నియామక పత్రాలు అందజేయాల్సినవి
గ్రూప్ 4 (టీజీపీఎస్సీ) 8,143
మొత్తం నియామకాలు 53,310