హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రియల్ ఎస్టేట్అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవెలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) ప్రశంసించింది. హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని, సంస్కరణలను మెచ్చుకుంది. రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మెట్రో విస్తరణ వల్ల స్థిరాస్తుల రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని నగరంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పలువురు రియల్టర్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు నగరం అభివృద్ధిపై చర్చించారు.
ఈ పరిణామాలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మరింత పటిష్టం చేస్తూ, ప్రపంచ ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా హైదరాబాద్‌ను మారుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం భూ భారతి చట్టంతో భూ పరిపాలనను సులభతరం చేస్తోందని, వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తోందని నరెడ్కో పేర్కొంది. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.
‘రియల్’ అంచనాలకు తగ్గట్టుగా లేదు
మధ్యలో నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులకు కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించినప్పటికీ.. బడ్జెట్ తమ అంచనాలకు తగ్గట్టుగా లేదని ప్రముఖ రియల్ఎస్టేట్సంస్థలు క్రెడాయ్, నరెడ్కో పేర్కొన్నాయి. గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై మినహాయింపు పెంపు, బడ్జెట్హౌసింగ్ విభాగాన్ని ప్రోత్సహించడానికి రాయితీలు వంటి అనేక అంశాలను తాము ఆశించినట్టు తెలిపాయి.