‘పట్టణ ప్రగతి’కి ఫండ్స్​ రావట్లే..సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల వరకు పెండింగ్

సూర్యాపేట, వెలుగు; మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఫండ్స్ రావడం లేదు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఒక్క పైసా కూడా సర్కార్ విడుదల చేయలేదు. దీంతో పట్టణాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అక్కడక్కడ చేసినవాటికి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఎదురు చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి వేడుకలు నిర్వహించడమేంటని వారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మొదట్లో ఇచ్చిన్రు కానీ ఇప్పుడే..

మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ తో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ జమ చేసి ప్రతినెలా బిల్లులు చెల్లించేందుకు 2020లో పట్టణ ప్రగతి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. జనాభా ప్రతిపాదికన మున్సిపాలిటీల్లో ఎన్ని ఫండ్స్ కేటాయించాలో ముందుగానే నిర్దేశించి ఆ మేరకు పనులను ప్రపోజల్స్ పెట్టేవారు. పూర్తి చేసిన పనులకు వెంటనే ఫండ్స్ విడుదల అయ్యేవి. కానీ  2021 ఆగస్టు నుంచి పట్టణ ప్రగతి ఫండ్స్ లో ప్రభుత్వం 25శాతం కోత పెడుతోంది. మిగతా 75శాతం ఫండ్స్ నెలవారీగా మున్సిపాలిటీ లకు ఫండ్స్ విడుదల చేస్తోంది. 2022 నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన పట్టణ ప్రగతి ఫండ్స్, 2022 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 15వ ఫైనాన్స్ ఫండ్స్ 2023 మార్చి 31న రిలీజ్ చేసినట్లు చెప్తున్నా అవి ట్రెజరీ అకౌంట్ లోనే నిలిచిపోయాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ లకు సర్కార్ ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. 

రూ.5కోట్లు పెండింగ్..!

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి దాదాపు రూ.5కోట్ల వరకు ఫండ్స్ విడుదల కావాల్సి ఉంది. సూర్యాపేటకు రూ.2.31కోట్లు, కోదాడ రూ.27లక్షలు, తిరుమలగిరి రూ.40లక్షలు, హుజూర్ నగర్ రూ. 68లక్షలు, నేరేడుచర్లకు రూ.39లక్షలు విడుదల కావాలి. వీటితో పాటు పనులు పూర్తి చేసిన బిల్లులు దాదాపు కోటి రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి.

ఫండ్స్ విడుదల చేస్తేనే పనులు

పట్టణ ప్రగతి ఫండ్స్ విడుదల చేయకపోవడంతో మున్సిపాలిటీ లలో పనులు ముందుకు సాగడం లేదు. కొత్త పనులు చేయాలంటే ఫండ్స్ విడుదల చేస్తేనే పనులు చేస్తామంటూ కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్​ చేసింది. ఫండ్స్ రిలీజ్ చేయకుండా పట్టణ ప్రగతి వేడుకలు చేస్తుండడం పట్ల బిల్లులు రాని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసి మున్సిపాలిటీ డెవలప్ మెంట్ వర్క్స్ పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ప్రజలు కోరుతున్నారు.

ఫండ్స్ రాగానే  పనులు పూర్తి చేస్తాం 

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పట్టణ ప్రగతి కింద నెలకు రూ.13.61లక్షలు కేటాయించారు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాకపోవడంతో సీసీ రోడ్లు, డ్రైనేజి పనులు నిలిచిపోయాయి. ఫండ్స్ రాగానే పనులను పూర్తి చేస్తాం.  

ఎం.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, హుజూర్ నగర్