ఉప్పల్– -నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మిస్తరా.. తప్పుకుంటరా?

ఉప్పల్– -నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మిస్తరా..  తప్పుకుంటరా?
  • పనులు ప్రారంభించకుంటే టెండర్​ రద్దు చేస్తామని సర్కారు హెచ్చరిక
  • డిసెంబర్​లోపు పనులు స్టార్ట్​ చేయాలని డెడ్​లైన్  

హైదరాబాద్, వెలుగు:  ఉప్పల్– నారపల్లి ఫ్లై ఓవర్ పనులను వచ్చే నెలలో ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేస్తామని గాయత్రి కన్ స్ట్రక్షన్​ను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే పనులు స్టార్ట్​ చేయాలని సూచించింది. ఈ ఫ్లై ఓవర్ పనులు స్లోగా కొనసాగుతుండడంపై కొన్నేండ్లుగా బీఆర్ ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా పనులను వేగంగా చేపట్టి  ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్​ చేస్తూ వచ్చింది. 

ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంపెనీ ప్రతినిధులతో ఎన్ హెచ్ ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా), మోర్త్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ హైవేస్ ) అధికారులు చర్చలు జరపడంతో కొంత టైమ్ ఇవ్వాలని అడిగారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇచ్చిన టైమ్ కూడా పూర్తి కావొస్తుండడంతో డిసెంబర్ వరకు పనులు ప్రారంభించాలని  డెడ్ లైన్ విధించినట్లు ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. 

ఆరేండ్లుగా పెండింగ్​..

ఉప్పల్ నుంచి నారాపల్లిలోని సీపీఆర్ ఐ (సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) వరకు రూ.527 కోట్లతో 6.25 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్  నిర్మాణ పనులకు 2018లో  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. రెండేండ్లలో ఈ ఫ్లై ఓవర్​ పూర్తి చేయాలని కాంట్రాక్టు దక్కించుకున్న గాయత్రి కన్ స్ట్రక్షన్స్​కు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు కేవలం 44 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, పిల్లర్లు పూర్తి చేసి స్లాబులు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 147 స్లాబ్ లు వేయాల్సి ఉండగా కేవలం 37 మాత్రమే పూర్తయినట్లు తెలిపారు. 

పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

నత్తనడకన కొనసాగుతున్న పనులను ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. స్థానికులతోనూ మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఇటీవల గాయత్రి కంపెనీ ప్రతినిధులనుసెక్రటేరియెట్​కు పిలిపించి మాట్లాడారు. వెంటనే పనులు స్టార్ట్ చేయాలని, లేకపోతే టెండర్ రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనుల్లో జాప్యం జరుగుతున్నదని కంపెనీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో సబ్ కాంట్రాక్టు కంపెనీతోనైనా పనులు చేపట్టాలని మంత్రి సూచించినట్లు తెలుస్తున్నది.