ఇటీవల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించే విషయంపై కీలక అంశాలు వెల్లడించింది. వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర , సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసుల తీర్పుల్లోని పలు అంశాలను తెలుపుతూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ , ఆర్టికల్ 243లో తెలిపిన విధంగా ప్రతి ఐదేండ్లకు తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు కల్పించడం కోసం కులాల వారీగా బీసీల లెక్కింపు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తూ, మిగతా రిజర్వేషన్లను బీసీ కులాలకు కేటాయించి మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి మించనివ్వొద్దని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనాభాను లెక్కించనట్లయితే బీసీ రిజర్వేషన్లు కల్పించకుండానే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ప్రమాదకరమైన ఆదేశాలు జారీ చేసింది.
పక్క రాష్ట్రాల్లో పూర్తి..
కేంద్ర ప్రభుత్వం నిరుడు105వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో బీసీ కులాలను చేర్చడం లేదా తొలగించడం, బీసీ కోటా నిర్ధారణ వంటి అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాల్లోని బీసీ కులాల జనాభాను లెక్కించుకునే అవకాశం కలిగింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాలు కులాల వారీగా బీసీల జనాభా లెక్కింపును పూర్తి చేశాయి కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల లెక్కింపునకు కసరత్తు చేస్తున్నట్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చినా.. చేస్తుందో లేదో తెలియడం లేదు. ఎందుకంటే 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించలేదు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు1994 నుంచి అమలు చేస్తున్న 34 శాతం రిజర్వేషన్లను కుదించి 24 శాతం అమలు చేస్తున్నారు. ఫలితంగా గత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు1000కి పైగా సీట్లను కోల్పోయారు. వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 10 శాతం సీట్లను వదులుకోవాల్సి వచ్చింది.
50 శాతానికి మించి కూడా..
రాజ్యాంగంలోని ఆర్టికల్246లో తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతి10 సంవత్సరాలకు జనాభా లెక్కలతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు చేస్తున్నది. 2014లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సెన్సెస్ కమిషనర్ వర్సెస్ ఆర్. కృష్ణమూర్తి మధ్య జరిగిన కేసు తీర్పులో అప్పటికే మద్రాసు హైకోర్టు ధర్మాసనం బీసీ కులాల లెక్కలను జనాభా లెక్కలతో పాటుగా లెక్కించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సదరు మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, బీసీ కులగణన చేయాలా? లేదా? అనేది ప్రభుత్వం నిర్ణయించుకొని చేయాలి. కానీ, కులాల వారీగా బీసీలను లెక్కించాలని కోర్టులు ఆదేశించలేవని సుప్రీం తెలిపింది. బీసీ కులాల హక్కులు, రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ రచనలోనే అన్యాయం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని1992లో మండల కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే తీర్పులో బీసీ కులాలకు సంబంధించిన జనాభా లెక్కలు ఉంటే 50 శాతం రిజర్వేషన్లకు మించి అమలు చేసుకోవచ్చని సూచించింది.
ప్రభుత్వం స్పందించాలె..
కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని అగ్రకులాల్లోని బలహీన వర్గాలకు
10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. తద్వారా సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల నిబంధన తొలగించినట్లు అయింది. నేడు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే బీసీ కమిషన్ ద్వారా కులాల వారీగా బీసీల లెక్కింపు ప్రారంభించాలి. లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించిన 24 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి ఉండదు.
- కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర అధ్యక్షులు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం