కేంద్రాన్ని కోరిన పలు రాష్ట్రాలు
రెండు వారాలైనా మంచిదే.. ఒకేసారి ఎత్తివేస్తే సమస్యలు వస్తయన్న స్టేట్స్
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ: ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పలువురు ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేస్తే ప్రజలను కంట్రోల్ చేయడం కష్టమని, కరోనా వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే ఇప్పటివరకైతే లాక్‌డౌన్ పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో అన్నారు. కరోనా కట్టడి కోసం ప్రధాని మోడీ మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.
పొడిగిస్తేనే మేలు
ఢిల్లీ మర్కజ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లోనే మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు రెండింతలయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని పలు రాష్ట్రాల అంటున్నాయి. కనీసం ఒకటీ రెండు వారాలు పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు, ఈ నెల చివరి వరకు కొనసాగించాలని మరికొన్ని రాష్ట్రాలు సూచిస్తున్నాయి. ప్రమాదకర కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు మరింత సిద్ధంగా ఉండాలని సోమవారం కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ కూడా సూచించారు. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ఆయన ఇండికేషన్ ఇచ్చారు. మంగళవారం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాలు ఒకేసారి ఎత్తివేయొద్దని, దశలవారీగా సడలించాలనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను రెండు వారాలైనా పొడిగించాలని తాను ప్రధానిని కోరుతున్నట్లు చెప్పారు.
ఆర్థికంగా నష్టపోతే మళ్లీ రాబట్టుకోవచ్చని, ప్రజల ప్రాణాలను కోల్పోతే మాత్రం తిరిగి తెచ్చుకోలేమని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నారు. సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే మాట అనగా.. మంగళవారం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా దీన్నే ప్రస్తావించారు. అవసరమైతే తమ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తుందని, ఉన్నఫళంగా ఎత్తివేసే ఆలోచన లేదని చౌహాన్ చెప్పారు. కొవిడ్ వంటి మందులేని వ్యాధిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. తాము కూడా ఒకేసారి లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు సిద్ధంగా లేమని, దశలవారీగా ఎత్తివేసేందుకు ఆలోచిస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. కేంద్రం కూడా లాక్‌డౌన్ పొడిగింపు విషయంలో ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 15న అన్నిటింనీ ఓపెన్ చేయాలని తాము కోరుకోవడం లేదని, ఒక పద్ధతి ప్రకారం అది ఉంటేనే 21రోజుల లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరుతుందని అసోం ఫైనాన్స్ మినిస్టర్ హిమంతా బిశ్వ శర్మ అన్నారు. కరోనా రెడ్ జోన్, హాట్‌స్పాట్ ఏరియాల్లో మరో రెండు వారాల పాటు కానీ, ఈ నెల చివరి వరకు గానీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తేనే మేలని కర్ణాటక మినిస్టర్ సుధాకర్ అభిప్రాయపడ్డారు. కరోనా ఫ్రీ అని తేలిన తర్వాతే లాక్డౌన్ఎత్తివేయాలని ఉత్తరప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీశ్ అవాస్తీ అన్నారు. ‘‘లాక్‌డౌన్ ఎత్తివేయడమంటే అది కరోనా ఫ్రీ అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఉండాలి. అలా కాకుండా ఒక్క పాజిటివ్ పేషెంట్ఉన్నా.. లాక్డౌన్ఎత్తివేస్తే చాలా సమస్యలు వస్తాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో కూడా ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచనలో లేమని ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే చెప్పారు. ముంబై, పుణె వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, లాక్‌డౌన్ పొడిగింపే వైరస్ కట్టడికి ఆయుధమని ఆయన పేర్కొన్నారు. కేరళ ఎక్స్పర్ట్ ప్యానెల్ కూడా దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తేనే ఉపయోగమని, ఒక్కసారిగా ఎత్తివేయడం మంచిది కాదని అభిప్రాయపడింది.
పరిశీలిస్తున్న కేంద్రం
లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న వివిధ రాష్ట్రాల విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికైతే పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. చాలా రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల దృష్ట్యా కేంద్రం త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఎత్తివేస్తే అది దశలవారీగా, సెక్టర్ల వారీగా, జిల్లాల వారీగా ఉంటుందని చెబుతున్నాయి. దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ పొడిగింపుపై ఇప్పటికైతే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయొద్దు” అని సూచించారు.
కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి : ఉపరాష్ట్రపతి
లాక్‌డౌన్ విషయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ప్రజలు కట్టుబడి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. లాక్‌డౌన్ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నందువల్ల ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయం ఏదైనా.. ఈ 21 రోజులు లాక్‌డౌన్ పాటించిన స్ఫూర్తినే ప్రజలు కొనసాగించాలని ఆయన కోరారు. భవిష్యత్తు కోసం ఇంకా కొన్ని రోజులు కష్టపడదామని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ ఎత్తేసే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వచ్చేవారం చాలా కీలకమని అన్నారు. కరోనా వ్యాప్తి, కేసుల పెరుగుదలపై ఆధారపడి లాక్‌డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. “ ప్రజల ఆరోగ్యం, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పై చర్చ నడుస్తోంది. నా దృష్టిలో ఎకానమీని బలోపేతం చేసేందుకు కొన్ని రోజులు ఆగొచ్చు.. మనిషి ఆరోగ్యం విషయంలో మాత్రం వెయిట్ చేయలేం” అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలోని మూడోవంతు కేసులతో ముడిపడి ఉన్న ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలు సోషల్ డిస్టెన్స్‌ను ఉల్లంఘించడమే అని, అందరికీ ఇది ఒక కనువిప్పు లాంటిది అని ఆయన పేర్కొన్నారు.
ఒకేసారి ఎత్తేయొద్దు: డబ్ల్యూహెచ్‌వో
లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని భావిస్తున్న దేశాలు అందుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి రావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) సూచించింది. అన్ని రెస్ట్రిక్షన్స్‌ను ఒకేసారి ఎత్తేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల అన్ని ఆంక్షలను ఒకేసారి కాకుండా విడతల వారీగా సడలింపుపై నిర్ణయం తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ చెప్పారు. లాక్ డౌన్ కారణంగా చాలా దేశాల్లో స్కూళ్లు, ఆఫీసులు, సామాజిక కార్యక్రమాలు ఆగిపోయాయని, పార్కుల వంటివి కూడా మూతపడ్డాయని, ఆంక్షలను ఒకేసారి ఎత్తేయడం వల్ల జనం ఒక్కసారిగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందని, ఇది మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని మేనేజ్ చేయగలిగే స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్లాన్ ప్రకారం ఆంక్షలు ఎత్తేయాలని సూచించారు.
ఎకానమీ కన్నా.. హెల్త్ ముఖ్యం
ప్రజల ఆరోగ్యం, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పై చర్చ నడుస్తోంది. నా దృష్టిలో ఎకానమీని బలోపేతం చేసేందుకు కొన్ని రోజులు ఆగొచ్చు.. మనిషి ఆరోగ్యం విషయంలో మాత్రం వెయిట్ చేయలేం.
– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మే 15 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని అన్ని ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ను మే 15 వరకు మూసి వేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సూచించారు. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా వచ్చే నెల 15 వరకు విద్యాసంస్థలను బంద్ చేయాలని కోరారు. అదే విధంగా లాక్ డౌన్ కొనసాగినా, సడలించినా జనం గుమిగూడే ప్రాంతాలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ప్రార్థన మందిరాలు, మాల్స్, పబ్లిక్ ప్లేస్ లో కొన్ని రోజుల పాటు జనం గుమిగూడకుండా చర్యలు చేపడతామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో పరిస్థితి పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, రామ్ విలాస్ పాశ్వాన్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.
For More News..