- జాతీయ వికాసం కోసం ఏబీవీపీ పనిచేయాలి
సిద్దిపేట, వెలుగు: జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఎబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో యువతకు కొదవ లేదని, భారత్ లో ఇరవై శాతానికి పైగా ఉన్న యువత భవిష్యత్ ఆశాకిరణాలని అన్నారు. ఎబీవీపీ వ్యక్తి వికాసం కోసం కాకుండా జాతీయ వికాసం కోసం పనిచేస్తుందన్నారు. ఎబీవీపీ నుంచి ఎంతోమంది గొప్ప లీడర్లుగా ఎదిగారని గుర్తు చేశారు. జాతి నిర్మాణంలో మీ పాత్ర గొప్పగా ఉండాలన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన జాతీయ భావాలను మరవొద్దని సూచించారు. యువత సరికొత్తగా ఆలోచించాలన్నారు.
భారత్‌ను విశ్వగురు చేయాలన్న వివేకానందుని లక్ష్యం వైపు పయనించాలని పిలుపునిచ్చారు. ధర్మం మతం కాదని అది ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు . యువత కలలు కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. ఎబీవీపీ ప్రస్థానం మిగిలిన సంస్థల కన్నా భిన్నమైందని ఎబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ అన్నారు. హిందినీ జాతీయ భాషగా గుర్తించాలని సూచించింది ఎబీవీపేనని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏబీవీపీ నేతలు ప్రాణాలొడ్డి నక్సల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి, గోపన్నలాంటి నేతలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఏబీవీపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా జానారెడ్డి, కార్యదర్శిగా ఎం. రాంబాబు ఎన్నికయ్యారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా బీజెపీ అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, అప్పాల ప్రసాద్, గురువా రెడ్డి, ఏబీవీపీ నేతలు అశోక్ కుమార్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : ‘ఓరియంట్’ కార్మికుల భవిష్యత్ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్
గవర్నర్ కు ఘన స్వాగతం
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు కలెక్టర్ మను చౌదరి, ఇన్ఛార్జీ సీపీ అఖిల్ మహాజన్ పుష్ఫగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. కలక్టరేట్‌లో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జిల్లా అధికారులతో కొద్ది సేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏబీవీపీ మీటింగ్‌కు వెళ్లారు.