- మామునూర్ ఎయిర్‍పోర్ట్, నియో మెట్రోకు నిధుల్లేవ్
- మెగా టెక్స్టైల్ పార్క్, సెంట్రల్ జైల్ ను పట్టించుకోలే
- అటకెక్కిన ఏటా రూ.300 కోట్ల స్పెషల్ ఫండ్స్
- సభలలో ఇచ్చిన హామీలకూ మోక్షం కరువు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు అంటే ఎనలేని ప్రేమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‍లో ఈప్రాంత ఊసే ఎత్తలేదు. బడ్జెట్‍లో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ఆశించిన గ్రేటర్వాసులు బడ్జెట్ను చూసి కంగుతిన్నారు. హామీలు, పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్కపైసా కేటాయించలేదు. ప్రసంగంలో కేవలం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు చెప్పి వదిలేశారు. వరంగల్ పరిధిలో మేజర్ ప్రాజెక్టులు ఉన్నా వాటి జోలికి వెళ్లలేదు. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న మామునూర్ ఎయిర్‍పోర్ట్, నియో మెట్రో రైల్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వంటి పెండింగ్ ప్రాజెక్టులకు ఫండ్స్ అలాట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వివిధ సభల్లో ఇచ్చిన హామీలకూ మోక్షం కలుగలేదు.
పెండింగ్ ప్రాజెక్టులివీ..
వరంగల్ మామునూర్ ఎయిర్‍పోర్ట్ విషయంలో జిల్లాకు అన్యాయమే జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ రేపోమాపో ఇక్కడి నుంచి విమానాలు నడుస్తాయన్నట్లు ప్రకటనలు చేశారు.. తీరాచూస్తే బడ్జెట్‍లో మొండిచేయి చూపారు. కనీసం దీని ప్రస్తావన తీయలేదు. హైదరాబాద్‍లోని శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ కు రూ.7500 కోట్లతో జూన్‍లోపే పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కానీ మామునూర్ ఎయిర్ పోర్ట్ ను మాత్రం పట్టించుకోలేదు.
వరంగల్ వాసుల కలల ప్రాజెక్టు నియో మెట్రో రైల్ ప్రస్తావన లేదు. రూ.1340 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని 2014 నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లోనూ దీనిని ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‍కు అప్పగించగా.. ఆ సంస్థ సర్వే చేసి రూ.1100కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి డీపీఆర్ అందించారు. కానీ రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదు.
వందల ఏండ్ల చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైల్ ను సర్కారు కూల్చేసింది. దాని స్థానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పింది. మామునూరులో అత్యాధునిక సెంట్రల్ జైల్ నిర్మిస్తామని బదులిచ్చింది. తీరా బడ్జెట్ లో దీనికి రూపాయి కూడా
ఇవ్వలేదు.
వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల మధ్య కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు 2017లో సీఎం కేసీఆర్ కొబ్బరికాయ కొట్టారు. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఐదేండ్లలో 1.20 లక్షల మందికి జాబ్స్ వస్తాయని ప్రకటించారు. రైతుల నుంచి బలవంతంగా దాదాపు 1,190 ఎకరాల భూమి సేకరించారు. వీరికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఐదున్నరేళ్లు గడిచినా ఇంకా ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. బడ్జెట్ లో టెక్స్ టైల్ ముచ్చటే తీయలేదు.
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో జీడబ్ల్యూఎంసీ అభివృద్ధికి ఏటా రూ.300కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2021 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బడ్జెట్‍లో రూ.250 కోట్లు కేటాయించారు. అవి నేటికీ రిలీజ్ కాకపోవడంతో కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలంటూ నిరసనలకు దిగారు. పనులు మధ్యలోనే ఆపేశారు. ఈ బడ్జెట్లోనూ స్పెషల్ ఫండ్స్ ను సర్కారు పట్టించుకోలేదు.
మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ పథకం ద్వారా నగరానికి నిధులు కేటాయిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను చెల్లించడం లేదు. అంతేకాక వరంగల్ నీట మునిగినప్పుడు రిటైన్వాల్, కల్వర్టులు, నాలాల అభివృద్ధికి రూ.300కోట్లు ఇస్తామని చెప్పారు.
ఓరుగల్లుపై చిన్నచూపెందుకు?
బీఆర్‍ఎస్ ప్రభుత్వానికి మొదటినుంచి గ్రేటర్ వరంగల్ అంటే చిన్నచూపే. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు సార్లు కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‍ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత 9 ఏండ్లలో మామునూర్ ఎయిర్‍పోర్ట్, గ్రేటర్ కార్పొరేషన్‍కు ఏటా రూ.300 కోట్ల స్పెషల్ ఫండ్, మెట్రో రైల్, టెక్స్ టైల్ పార్క్, స్మార్ట్ సిటీ ఫండ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి ఎన్నో హామీలు.. హామీలుగానే మిగిలాయి. ప్రతిసారి బడ్జెట్‍లో వరంగల్ సిటీకి అన్యాయమే జరుగుతోంది. ఈ పనులు చేపించుకోవడంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారు. - డాక్టర్ తిరునాహరి శేషు(సామాజిక విశ్లేషకులు)