- జగిత్యాలలో మిషన్ భగీరథ మోటార్ల మొరాయింపు
- గ్రామాల్లో నీటి కోసం బోర్లు, బావులే దిక్కు
- సుమారు 150 గ్రామాల్లో పైగా కష్టాలు
- స్పందించని సర్కార్
జగిత్యాల, వెలుగు: మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు ఊరురా సరఫరా చేస్తున్నామని తెలంగాణ సర్కార్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోతుంది. మరమ్మతులు, మోటార్ల రిపేర్లతో నీళ్లు రాక గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి భగీరథ నీటిని పైప్ లైన్ ద్వారా జిల్లాలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అయితే కొన్ని నెలల నుంచి సమస్యలతో ఈ నీటి సరఫరా సజావుగా సాగడం లేదు. రెండు నెలలుగా మోటార్ల మరమ్మతులతో నీరు సరఫరా కాక గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఎగువ ప్రాంతాలకు సరఫరా నిల్
జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం డబ్బా నుంచి కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లోని 341 గ్రామాల్లో ఇంటింటికీ భగీరథ నీటిని సప్లై చేయడానికి మెయిన్ పైప్ లైన్, ఇంటర్నల్ పైప్ లైన్ నిర్మించారు. డబ్బా వాటర్ గ్రిడ్‌కు రా వాటర్ సప్లై చేయడం కోసం నిజామాబాద్ జిల్లా జలాల్ పూర్ వద్ద ఏర్పాటు చేసిన ఆరు మోటర్ల లో మూడు పని చేయడం లేదు. దీని వల్ల రా వాటర్ సప్లై తగ్గిపోయింది. సుమారు 150 గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లకు నీరు చేరడం లేదు. ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలకు చుక్క నీరు కూడా అందడం లేదు. మోటార్లను రిపేర్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బోర్లు, బావులే దిక్కు..
భగీరథ నీరు సరఫరా నిలిచిపోవడం తో గ్రామ పంచాయతీలే బోరు, బావి నీళ్లను పాత పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నాయి. పాత బోర్లు, బావి నీళ్లు, ట్యాంకుల ద్వారా వచ్చే నీటి తో గ్రామ పంచాయతీనే సరఫరా చేస్తుంది. ఎన్ని సార్లు నీటి సరఫరా నిలిచిపోయిందని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. మిషన్ భగీరథ నీటి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో ఫిల్కావడం లేదు
మిషన్ భగీరథ నీళ్లు తగిన మోతాదు లో రాకపోవడం తో ట్యాంకుల్లో పైకి నీళ్లు ఎక్కటం లేదు. గ్రామానికి సరఫరా చేయడం కోసం గ్రామ పంచాయతీ నుంచి రెండు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేసి ట్యాంకులు నింపి నీటి సరఫరా చేస్తున్నాం. భగీరథ నీళ్లు వచ్చినా ట్యాంకులు పూర్తిగా నిండటం లేదు.–వీ. నాగరాజు, మొగిలిపేట్ సర్పంచ్, జగిత్యాల
నీళ్ళు ఎత్తి పోసే పంపులు చెడిపోయాయి
డబ్బా గ్రామంలోని వాటర్ గ్రిడ్ కు రా వాటర్ సప్లై చేయడం కోసం నిజామాబాద్ జిల్లా జలాల్ పూర్ వద్ద ఆరు మోటర్లు ఏర్పాటు చేశారు. అందులో మూడు మరమ్మతులకు వచ్చాయి. దీంతో రా వాటర్ సప్లై తగ్గి పోయింది. దీని వల్ల జిల్లాలోని కొన్ని ప్రాంతంలో భగీరథ నీటి సరఫరా లో ఇబ్బందులు తలెత్తాయి. తొందరలోనే సమస్య పరిష్కరించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటాం.
–ప్రేమ కుమార్, డీఈఈ
నాలుగు నెలలుగా నీటి సరఫరా లేదు
గ్రామంలో నాలుగు నెలలుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదు. నీటి సరఫరా కోసం ప్రతి నెల రూ.లక్షన్నర కరెంట్ బిల్లులు కడుతున్నాం. పంచాయ తీ పై ఆర్థిక భారం పడుతోంది. అధి కారులు స్పందించి వెంటనే గ్రామాలకు భగీరథ నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలి.
– జంగిటి అంజయ్య, సర్పంచ్, బండ లింగాపూర్