గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌ కుటుంబానికి అండగా ఉంటాం
  • భోపాల్‌లో వరుణ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన మధ్యప్రదేశ్ సీఎం

హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతదేహం భోపాల్ చేరుకుంది. బెంగళూరు నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో భోపాల్‌కు తరలించారు. భోపాల్ ఎయిర్ పోర్టులో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అధికారులు వరుణ్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తర్వాత వరుణ్ సింగ్ ఇంటికి మృతదేహాన్ని తరలించారు. వరుణ్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ.. వారి కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్థిరపడింది.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన అనంతరం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ మీడియాతో మాట్లాడారు. వరుణ్ సింగ్ అంత్యక్రియలను ప్రభుత్వ, మిలిటరీ గౌరవ లాంఛనాలతో చేస్తామని చెప్పారు. ఆయన కుటుంబమంతా దేశానికి అంకితమైందని, ఈ కష్ట సమయంలో వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. వరుణ్ కుటుంబసభ్యులతో మాట్లాడి.. రాష్ట్రంలో ఏదైనా సంస్థకు ఆయన పేరు పెడతామని, అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శివరాజ్‌ సింగ్ చెప్పారు. వరుణ్ కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

కాగా, ఈ నెల 8న తమిళనాడులోని కూనూర్‌‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 14 మంది ప్రయాణించిన హెలికాప్టర్ కూనూర్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో ఉన్న వరుణ్ సింగ్‌ను వెల్లింగ్టన్‌లోని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్‌కు తరలించారు. 7 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరుణ్ సింగ్ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు.