బాసర, వెలుగు : ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, లక్ష్యాన్ని సాధించవచ్చని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన దిశానిర్దేశం చేశారు. బుధవారం యూనివర్సిటీలోని పీయూసీ ఫస్టియర్ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ ముగింపు కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆడిటోరియంలో విద్యార్థులతో మాట్లాడారు.
ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యంతో చదవాలన్నారు. ర్యాంకులతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి కల్పనకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించే విధంగా విద్యావ్యవస్థ ఉండాలన్నారు. యూనివర్సిటీలో 70 శాతం బాలికలు ఉండడం సంతోషకరమైన విషయమన్నారు. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వాలు ఉపకార వేతనాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రధానంగా విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులతో మాదకద్రవ్య రహిత సమాజానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అసోసియేట్ డీన్స్ డాక్టర్ పావని, డాక్టర్ చంద్రశేఖర్, మహేశ్, కార్యక్రమ కో ఆర్డినేటర్ గజ్జల శ్రీనివాస్, పవన్, అధ్యాపకులు, ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.