
హుజూర్ నగర్, వెలుగు : పట్టణ శివారులోని రామస్వామిగుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని స్టేట్ హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుజూర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 135 బ్లాకుల్లో 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ ట్యాంక్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కూలీలను ఉపయోగించుకొని ఇండ్ల నిర్మాణాలను రెండు నెలల్లో పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. వారి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఎస్ఈ వెంకట్ దాస్ రెడ్డి, పీడీ ధర్మారెడ్డి, ఏఈ సాయిరాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా, కాంట్రాక్టర్ విజయ్ తదితరులు ఉన్నారు.
అనర్హులకు ఇండ్లు మంజూరు చేయొద్దు..
గరిడేపల్లి, వెలుగు : జిల్లాలో ఎక్కడా అనర్హులకు ఇండ్లు మంజూరు చేయొద్దని రాష్ట్ర హౌజింగ్ ఎండీ వీసీ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించడం కోసం గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేసిందన్నారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను మళ్లీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎవరైనా అనర్హులుంటే తిరస్కరించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల వివరాలు మొబైల్ లో నమోదు చేయడంతో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23 మండలాల్లోని పలు గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామన్నారు. ఎక్కడైనా అనర్హులను గుర్తిస్తే వెంటనే తిరస్కరిస్తామని తెలిపారు. సమావేశంలో జడ్పీ ఈఈవో అప్పారావు, హౌజింగ్ ఎస్ఈ వెంకటదాస్ రెడ్డి, పీడీ ధర్మారెడ్డి, పీఆర్ ఈఈ వెంకటయ్య, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.