- ఇందిరమ్మ మోడల్ హౌస్ రెడీ
- నెలరోజుల్లో నిర్మాణం పూర్తి
- 400 చదరపు అడుగుల గృహం
- ఇవాళ ప్రారంభించిన గృహనిర్మాణ మంత్రి పొంగులేటి
- 4 ఏండ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడమే లక్ష్యమని వెల్లడి
- పేదోళ్లయితే చాలు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తం
- కులం, మతం చూసి సంక్షేమ పథకాలు ఇవ్వబోమన్న మంత్రి
కూసుమంచి: ఇందిరమ్మ మోడల్ హౌస్ సిద్ధమైంది. డిసెంబర్ 13న రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఖమ్మం జిల్లా కూసుమంచి ఈ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 5 లక్షల వ్యయంతో దీని నిర్మాణం పూర్తి చేశారు.
హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్‌రూంతో బెడ్ రూంను నిర్మించారు. ఇంటి లోప లి గదు లు, ముందు వరండాలో టైల్స్ వేశారు. డాబా మెట్ల కింద టాయిలెట్‌ను నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు.
ఇంటికి రంగులు, ఇతరత్రా వసతులు కూడా కల్పించారు. ఈ మోడల్ హౌస్ కేవలం నెల రోజుల వ్యవధిలో పూర్తయింది. దీనిని ఇవాళ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను పేదలకే అందిస్తామని, కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు పెద్దలు ఎలా కొల్లగొట్టారో తెలుసని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ALSO READ | జనవరి 26 నుంచి రేషన్ కార్డులు.. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
మొదటి విడతగా మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3500 ఇండ్లు ఇస్తామని చెప్పారు. జనవరి 26 నుంచి పేదలు మెచ్చే మరో నాలుగు సంక్షేమ హామీలు అమలు కాబోతున్నాయని తెలిపారు.
రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టాలని చిత్తశుద్ధితో ఉన్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రెండు విడుతలుగా శ్రీకారం చుట్టబోతున్నమన్నారు.
అనంతరం కూసుమంచి మండలంలోని దుబ్బ తండాలో ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్, ఖమ్మం ఆర్డీఓ, హౌసింగ్ ఈ ఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు.