రాజన్న సిరిసిల్ల, వెలుగు: సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్టంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. సెస్ పరిధిలో 2014 వరకు 39 సబ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, తెలంగాణ ఏర్పడ్డాక 51 కోట్లతో 34 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, సిరిసిల్ల ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారనే నమ్మకం ఉందన్నారు. ఆయన వెంట టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, పవర్లూం కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
చందుర్తి, వేములవాడ: సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. మంగళవారం ఆయన వేములవాడ పట్టణంతోపాటు అర్బన్ మండలం, చందుర్తి, రుద్రంగిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రచారం చేశారు. చందుర్తి, రుద్రంగి అభ్యర్థులు ఏనుగుల కనుకయ్య, అల్లూరి సంతోష్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ కుమార్, రామస్వామి, లీడర్లు పాల్గొన్నారు.
బోయినిపల్లి: మండల సెస్ డైరెక్టర్ స్థానానికి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కొట్టేపల్లి సుధాకర్ తరుపున చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ప్రచారం చేశారు. మంగళవారం కోదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లిలో తిరిగి సుధాకర్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆయన వెంట అభ్యర్థి సుధాకర్, ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమ పాల్గొన్నారు. అలాగే బోయినిపల్లి మండలంలోని మల్కాపూర్, అనంతపల్లి, దుండ్రపల్లి, కోరేం, బూరుగుపల్లి, గుండన్నపల్లి గ్రామాలలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి జోగు రవీందర్ పక్షాన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ ప్రచారం చేశారు. రవీందర్ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట: కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెస్ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ స్టేట్లీడర్ తుల ఉమ తెలిపారు. మంగళవారం మండలంలోని ధర్మారంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సెస్ కు పునర్వైభవం రావాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రామచంద్రం, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.