తొర్రూరులో రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు

తొర్రూరు, వెలుగు : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించే యువతకు మంచి భవిష్యత్‌‌తో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. మహబూబాబాద్​జిల్లా తొర్రూరులోని యతిరాజారావు పార్కులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బేస్‌‌ బాల్‌‌ పోటీలను ఆదివారం ఆమె ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ స్టూడెంట్లు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, వారికి పేరెంట్స్‌‌ సైతం సహకరించాలని సూచించారు. ఆటల వల్ల క్రమశిక్షణ పెరగడంతో పాటు, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు కూడా పొందే అవకాశం ఉంటుందన్నారు.

ఆటల పోటీల నిర్వాహణకు సహకారం అందిస్తామని, ప్రభుత్వం తరఫున కూడా పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టూడెంట్లు జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూల్‌‌ గేమ్‌‌ ఫెడరేషన్‌‌ జిల్లా సెక్రటరీ జ్యతి, రాష్ట్ర పరీశీలకులు గంగా మోహన్, పీఏసీఎస్‌‌ చైర్మన్‌‌ కాకిరాల హరిప్రసాద్, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, లింగయ్య, నిరంజన్‌‌రెడ్డి పాల్గొన్నారు.