- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య
ముషీరాబాద్, వెలుగు : చరిత్ర మూలాలకు ఫొటో ఎంతో కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జరిగిన ఘటనలు కనుమరుగు కాకుండా కాపాడటంలో ఫొటో కీలకంగా మారిందన్నారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై, సంఘం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
ఫొటోగ్రాఫర్లు చరిత్రకారులని.. అనేక ఉద్యమాలు, కార్యక్రమాల్లో ఫొటోగ్రాఫర్లు కీలకపాత్ర వహించారని కొనియాడారు. ఫొటోగ్రాఫర్ల పిల్లల ఉన్నత విద్యకు తమ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. నూతన కమిటీకి ఎన్నికైన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకటరెడ్డి, అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి భీమ్ రెడ్డి మాధవరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్, కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.