మానసిక ఒత్తిడిని అధిగమించేందుకే క్రీడలు : డీజీపీ శివధర్ రెడ్డి

మానసిక ఒత్తిడిని అధిగమించేందుకే క్రీడలు : డీజీపీ శివధర్ రెడ్డి
  • ఇంటెలిజెన్స్  డీజీపీ శివధర్ రెడ్డి 
  • కరీంనగర్‌‌లో రాష్ట్ర స్థాయి పోలీస్​ క్రీడా పోటీలు ప్రారంభం

కరీంనగర్ క్రైం, వెలుగు: పోలీస్  ఉద్యోగం శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడితో కూడుకుందని, దానిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని ఇంటెలిజెన్స్  డీజీపీ బి శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మూడో రాష్ట్ర స్థాయి పోలీస్  క్రీడా పోటీలు కరీంనగర్  పోలీస్  కమిషనరేట్  పరేడ్  గ్రౌండ్ లో మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. డీజీపీ క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ రాష్ట్ర స్థాయి పోటీలకు కరీంనగర్  కమిషనరేట్  వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర పోలీసులు జాతీయ స్థాయిలో పాల్గొని 26 బంగారు, 79 వెండి, 102 కాంస్య పతకాలు సాధించారన్నారు.ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని విజయాలు  సాధించాలని సూచించారు. ఐజీపీ రమేశ్ రెడ్డి, కరీంనగర్, రామగుండం సీపీలు అభిషేక్ మహంతి, శ్రీనివాసులు పాల్గొన్నారు.