ఇయ్యాల్టి నుంచి రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్

ఇయ్యాల్టి నుంచి రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్
  • కరీంనగర్ లో పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ
  • 20 పోలీస్ జోన్స్ నుంచి2,500 మంది క్రీడాకారుల హాజరు
  • 12 క్రీడా వేదికలపై 29 క్రీడా అంశాల్లో సాగనున్న పోటీలు
  •  పోటీలను ప్రారంభించనున్న ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి 

కరీంనగర్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర స్థాయి మూడో పోలీస్ క్రీడా పోటీలు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 20 పోలీస్ జోన్స్ నుంచి 2,500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు.12 క్రీడా వేదికలపై ఫుట్ బాల్, కబడ్డీ, ఖోఖో,వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, షటిల్ బ్యాడ్మింటన్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, హాకీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా తదితర 29 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించనున్నారు.  

సాయంత్రం 4  గంటలకు కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఇంటెలిజెన్స్ డీజీపీ జి.శివధర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలను కల్పించారు.  కరీంనగర్ లోని సీటీసీ, హెడ్ క్వార్టర్స్, అంబేద్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, సీపీటీసీ, కరీంనగర్ క్లబ్, జీఎస్ అకాడమీ, అలుగునూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 1న ఉదయం 8 గంటలకు పోటీల ముగింపు సమావేశానికి డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు.

స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు లాక్ తో పోలీసులకు తిప్పలు 

పోలీస్‌ స్పోర్ట్స్ మీట్‌ కు వచ్చేవారిలో 15‌‌0 మందికి క్రీడాకారులకు బీఆర్ అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  అకామిడేషన్ కల్పించారు. సోమవారం రాత్రి వరకు చేరుకున్న క్రీడాకారులు ఇందులో స్టే చేయాల్సి ఉంది. పోలీసు శాఖ వారి కోసం బెడ్స్ కూడా సిద్ధం చేసింది. ఈ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకునేందుకు సోమవారం మధ్యాహ్నం పోలీసులు వెళ్లగా అప్పటికే తాళం వేసి ఉంది. 

దీంతో సంబంధిత ఆఫీసర్లకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చినట్లు తెలిసింది. 2500 మంది కోసం ఇప్పటికే కరీంనగర్ సిటీలోని హోటల్ రూమ్స్, ఫంక్షన్ హాళ్లు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో హోటల్స్ ఫుల్ అయ్యాయని, 150 మందిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది.