పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం

పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌‌లు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే గ్రామాల్లో ప్రల్లెప్రగతి కొనసాగుతుందని తేల్చి చెబుతున్నారు. ఇటు అధికార పార్టీ సర్పంచ్‌‌లు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. లక్షలకు లక్షలు అప్పులు చేసి.. గత పల్లెప్రగతిలో  పనులు చేయిస్తే.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తమను వేధిస్తోందని సర్పంచ్ లు వాపోయారు. ఈ క్రమంలో.. డిమాండ్లు, నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు రావాలని సర్పంచ్ సంఘాల రాష్ట్ర నాయకులను మంత్రి ఎర్రబెల్లి పిలిచారు. ఉదయం 7 గంటలకు రావాలని సర్పంచ్ సంఘాల నాయకులకు సమాచారం వచ్చింది. కానీ.. సమాచారం వాట్సప్ లో సర్క్యులేట్ కావడంతో దాదాపు 150 నుంచి 200 మంది సర్పంచులు మినిస్టర్ క్వార్టర్స్ కు చేరుకున్నాను. దీంతో గొడవ అయ్యే అవకాశం ఉందని భావించిన మంత్రి ఎర్రబెల్లి ముఖం చాటేశారు. సర్పంచ్ సంఘాల నాయకులు మాత్రమే రేపు రావాలని మంత్రి ఎర్రబెల్లి పీఏ ద్వారా సమాచారం ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు 30 రోజులు పల్లెప్రగతి నిర్వహించింది. రెండో విడత 2020 జనవరి 2 నుంచి 10 రోజుల పాటు కొనసాగింది. మూడో విడత 2020 జూన్ 1 నుంచి ఎనిమిది రోజులు కొనసాగింది. నాలుగో విడత 2021 జులై 1 నుంచి 10 రోజులు కొనసాగింది. అయితే పల్లె ప్రగతి ఉన్న ప్రతీ సారి సర్పంచ్ లు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు జరిగిన తర్వాతే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. దీంతో సర్పంచ్ లు మిత్తీలకు అప్పు తెచ్చి పనులు చేయించారు. ఇప్పటి వరకు ఆ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సర్పంచ్ లపై భారం పడింది. చేసిన పనులకు రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అనేక సార్లు అధికారులు, ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నారు అయినా ఫలితం రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15 కమిషన్ నిధులను కూడా గ్రామ పంచాయతీలు వాడుకోకుండా ప్రీజింగ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతిని బైకాట్ చేస్తామని సర్పంచ్ లు హెచ్చరించారు.

 

మరిన్ని వార్తల కోసం : -
దళితబంధు కారు బయటకు తీయొద్దు!


మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అన్నకు నిప్పు